
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నటి… ముప్పై ఏళ్లు పూర్తిగా అదృశ్యమైందంటే నమ్మగలరా? ఆమె ఎవరో కాదు.. గీతాంజలి సినిమాలో నాగార్జునతో జతకట్టిన గిరిజా షెట్టర్. 1989లో మణిరత్నం మాయలోకంలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయి… ‘జల్లంత కవ్వింత…’ అంటూ ఆడుతూ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్ని దోచేసింది.
గీతాంజలి ఆ రోజుల్లో కేవలం సినిమా కాదు. ఒక భావోద్వేగ తుఫాను! నాగార్జున కెరీర్‌లోనే మైలురాయి. ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్, మణిరత్నం దర్శకత్వం ఇప్పటికీ డైరెక్టర్లకి ఓ పాఠం ఈ సినిమా. గీతాంజలి తర్వాత గిరిజ ఏమైంది? గీతాంజలి తర్వాత మలయాళంలో మోహన్‌లాల్‌తో వందనం అనే సినిమాలో నటించింది గిరిజ. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా, ఒక కల్ట్ లవ్ స్టోరీగా ఈ సినిమా మిగిలిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో జో జీతా వోహి సికందర్ ఆఫర్ వచ్చినా ఆమె ఒప్పుకోలేదు. ఆ స్థానంలో ఆయేషా జుల్కా నటించింది. మోహన్‌లాల్‌తో చేసిన మరో సినిమా ధనుష్కోడి షూటింగ్ డబ్బు లేక ఆగిపోయింది. తెలుగులో రెండో సినిమా హృదయాంజలి… చాలా ఏళ్లు ఆలస్యమై 2002లో వచ్చి మూడు రాష్ట్ర అవార్డులు కొట్టేసింది. కానీ అప్పటికే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
Geetanjali
ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన గిరిజ కెరీర్ ఎందుకు ఒక్కసారిగా డౌన్ అయ్యిందనే విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. ఆరోజుల్ని గుర్తుచేసుకుంటూ.. ‘నాకు వచ్చిన దుఃఖం మళ్లీ గుర్తుకు రాకూడదని… సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాను. విదేశాల్లో సెటిల్ అయ్యాను.’ అని చెప్పుకొచ్చింది. బ్రేక్ కాదు… జీవితంలో వచ్చిన బాధల నుంచి తప్పించుకోవడానికి ఆమె సినిమానే వదిలేసింది.
30 ఏళ్ల తర్వాత 2024లో కన్నడలో ‘ఇప్పటి తప్పది ఇలయాలి’ అనే రొమాంటిక్ డ్రామాతో ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది! 50 ఏళ్ల వయసులోనూ గిరిజ అందం, గ్రేస్ ప్రేక్షకులను మాయచేస్తోంది. గీతాంజలి గిరిజాని చూసి పెరిగిన తరం ఇప్పుడు ఆశ్చర్యంతో, ఆనందంతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తోంది . ‘వెల్కమ్ బ్యాక్ గీతాంజలి గర్ల్’ అంటూ గిరిజని ప్రోత్సహిస్తున్నారు. మరి టాలీవుడ్లో గిరిజ రీఎంట్రీ ఎప్పుడో చూడాలి!