ప్రముఖ బాలీవుడ్ బయోగ్రాఫికల్ మువీ ’12th ఫెయిల్’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎస్ మనోజ్ శర్మ వాస్తవ అకడమిక్ విజయ గాథ ఇది. సమాజంపై ప్రభావం చూపే ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తి దాతలుగా యువతకు మార్గదర్శకత్వం వహిస్తుంటారు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత కథా వస్తువులను తెరకెక్కించేటప్పుడు వాస్తవాలను వక్రీకరించకుండా పాత్రలు, వాటి ఔచిత్యం దెబ్బ తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయంలో విధు వినోద్ చోప్రా నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు అనే చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతమైన మౌర్యానాకు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. విమర్శకుల ప్రశంశలు దక్కించుకున్న ఈ మువీ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో ఉత్తమ చిత్రంతోపాటు పలు అవార్డులను కైవసం చేసుకుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉంటే.. చూడావల్సిన మువీలు కూడా మరికొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటి.
ఇక 12th ఫెయిల్ రియల్ లైఫ్ హీరో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయిని అధిగమించారు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG)గా విధులు నిర్వహిస్తోన్న ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా ప్రమోషన్ (పదోన్నతి) పొందారు. 12th ఫెయిల్ ప్రమోషన్‌లో భాగంగా మనోజ్ శర్మ ఈ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ‘ఏఎస్‌పీ నుంచి ప్రారంభమైన నా ప్రయాణం ఈ రోజు భారత ప్రభుత్వ ఆదేశంతో ఐజీకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. ఇక మనోజ్ శర్మ ట్వీట్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన విజయాన్ని అభినందిస్తూ, నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ASP से शुरू हुई यात्रा आज के भारत सरकार के ऑर्डर से IG बनने तक जा पहुँची है। इस लंबी यात्रा में साथ देने के लिए मन से सभी का आभार pic.twitter.com/LEITH1OVVp
— Manoj Sharma (@ManojSharmaIPS) March 15, 2024
‘కంగ్రాచ్యులేషన్స్ సర్.. యువతరానికి మీరే నిజమైన స్పూర్తి’, ‘మీ కథ మాకు ఎంతో స్పూర్తి నిచ్చింది’, ‘ఈ దేశానికి మీలాంటి ముక్కుసూటి, నిజాయితీ కలిగిన అధికారులు కావాలి’.. అంటూ నెటిజన్లు రాసుకొచ్చారు. 12th ఫెయిల్ మువీ క్లైమాక్స్‌లో మనోజ్ శర్మ సివిల్స్ ఇంటర్వ్యూ సీన్ గుర్తుందా..? అక్కడ ఇంటర్వ్యూ గదిలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నల్లో ‘ఇది చివరి అవకాశం కదా.. ఒకవేళ నువ్వు సెలక్ట్ అవ్వకపోతే ఏం చేస్తావ్?’ అని ప్రశ్నించగా..
‘ఐపీఎస్ కావడమే నా లక్ష్యం కాదు. సమాజంలో సంస్కరణలు తీసుకురావడం నా లక్ష్యం. సెలక్ట్ కాకపోతే మా ఊరికి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పుకొంటా. జీవితంలో చీటింగ్ చేయకుండా ఎలా బతకాలో వారికి నేర్పిస్తా. అలాంటి వాళ్ల జీవితం ఎంత గొప్పగా ఉంటుందో పిల్లలకు వివరిస్తా. ‘నేను భూమికి వెలుగునిచ్చే సూర్యుడిని కాలేకపోతే.. కనీసం నా వీధిలో వెలుగునిచ్చే దీపాన్ని అవుతా’ అంటూ మనోజ్ శర్మ పాత్రదారి నటుడు విక్రాంత్ మాస్సే సమాధానం చెబుతాడు. ఇది కదా లైఫ్ గోల్ అంటే.. ఈ మాటలు ప్రతి యువత తన మనో ఫలకంపై ఖచ్చితంగా రాసుకోవల్సిన సువర్ణాక్షరాలు ఇవి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.