ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘యానిమల్’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో బీటౌన్ సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ.. మరోవైపు తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇందులో వయోలెన్స్ ఎక్కువగా ఉందని.. అలాగే పురుషాహంకారం ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై మండిపడ్డారు. తాజాగా ప్రముఖ పాటల రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ కూడా ఈ సినిమాపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి సినిమాల విజయం మంచిది కాదంటూ ఆందోళనం వ్యక్తం చేశారు.
ఇటీవల ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సినిమా పరిస్థితి గురించి ఆందోళనను వ్యక్తం చేశారు. “సమాజం మెచ్చుకునేలా ఎలాంటి పాత్రలను సృష్టించాలనుకుంటున్నారో ఈ రోజు యువ చిత్రనిర్మాతలకు ఇది పరీక్షా సమయం అని నేను నమ్ముతున్నాను. ఒక సినిమాలో ఒక పురుషుడు స్త్రీని తన షూ నొక్కమని అడిగాడు.. అలాగే స్త్రీని చెంపదెబ్బ కొట్టడం.. ఆ సినిమా సూపర్ హిట్ అయితే చాలా ప్రమాదకరం. ” అని అన్నారు జావేద్ అక్తర్. అయితే సినిమా పేరు ప్రస్తావించకుండానే యానిమల్ సినిమాలోని సన్నివేశాల గురించి మాట్లాడారు జావేద్.
“ఈ రోజుల్లో, సినిమా నిర్మాతల కంటే ప్రేక్షకులపై పెద్ద బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఎలాంటి సినిమాలు తీయాలి, ఎలాంటి సినిమాలు తీయకూడదు అనేది ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. అలాగే మన సినిమాల్లో ఎలాంటి విలువలు, నైతికత చూపించాలి, దేనిని తిరస్కరించాలి అన్న నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం బంతి ప్రేక్షకుల కోర్ట్‌లో ఉంది. ఈ రోజు, రచయితలు తెరపై ఎలాంటి హీరోని ప్రదర్శించాలనే పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. సమాజంలోనే ఈ గందరగోళం ఉంది. సమాజం ఏది ఒప్పు, తప్పు అనేదానిపై స్పష్టంగా ఉన్నప్పుడు, కథలో గొప్ప పాత్రలను సృష్టించవచ్చు. కానీ సమాజం ఏది ఒప్పు, ఏది తప్పు అని అర్థం చేసుకోలేనప్పుడు, మనం గొప్ప పాత్రలను సృష్టించలేరు.” అని అన్నారు.