
దళపతి విజయ్ నటించిన జననాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా జనవరి 9 న విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు తీర్పు కూడా జనవరి 9నే రానుంది. దీంతో తమ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితులు కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని విలైనంత త్వరగా ప్రకటిస్తాము. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం’ అని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా జన నాయకుడు సినిమా విడుదల వాయిదాతో విజయ్ అభిమానులను తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ఈ సినిమా సెన్సార్‌షిప్ అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా జారీ కాకపోవడంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు, ఈ కేసులో జనవరి 9, 2026న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఆ రోజే సినిమా విడుదల తేదీని ప్రకటించగా, విడుదలలో సమస్యల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో జన నాయకుడు పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రీ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా సినిమా వాయిదా పడడంతో విజయ్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
జన నాయకుడు నిర్మాతల ప్రకటన..
— KVN Productions (@KvnProductions) January 7, 2026
పరాశక్తి కూడా..
జన నాయకుడు సినిమాతో పాటు శివ కార్తికేయన్ నటించిన పరాశక్తికి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి.
పరాశక్తిని సమీక్ష కమిటీకి పంపారు. సెన్సార్ సభ్యులు సినిమా చూసిన తర్వాత, చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటనేమీ రాలేదని తెలుస్తోంది. ఇవాళ (జనవరి 8)న ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే, జన నాయకుడితో పాటు ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, చిత్ర బృందం ముమ్మరంగా ప్రమోషన్ పనుల్లో నిమగ్నమై ఉండటం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.