Most Recent

Diet Secret: తక్కువ తింటూనే కడుపు నింపుకోవడం ఎలా? ఈ స్టార్ హీరో డైట్ సీక్రెట్ ఫార్ములా ఇదే!

Diet Secret: తక్కువ తింటూనే కడుపు నింపుకోవడం ఎలా? ఈ స్టార్ హీరో డైట్ సీక్రెట్ ఫార్ములా ఇదే!

బాలీవుడ్ తెరపై తన బాడీతో, స్టైల్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఆ గ్రీక్ గాడ్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ స్టార్ హీరో.. తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బయటపెట్టారు. సాధారణంగా డైటింగ్ అంటే తక్కువ తినడం, ఆకలితో అలమటించడం అనుకుంటారు. కానీ ఈ సూపర్ స్టార్ మాత్రం “తక్కువ తినండి.. కానీ ప్లేట్ నిండా ఉండేలా చూసుకోండి” అనే కొత్త మంత్రాన్ని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఫిట్‌నెస్ ప్రియుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

అసలు రహస్యం..

ఆ స్టార్ హీరో ఎవరో కాదు, గ్రీక్​ గాడ్​గా అభిమానుల మనసు దోచేసిన బాలీవుడ్ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో ప్లేట్ నిండా రంగురంగుల కూరగాయలు, మాంసం కనిపిస్తున్నాయి. చూడ్డానికి అది చాలా పెద్ద మీల్‌లా అనిపించినా, అందులో ఉన్న క్యాలరీలు మాత్రం చాలా తక్కువ. దీనినే న్యూట్రిషన్ భాషలో ‘వాల్యూమ్ ఈటింగ్’ అని పిలుస్తారు. అంటే తక్కువ క్యాలరీలు ఉండి, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది.

ఆయన ప్లేట్‌లో ఏమున్నాయో గమనిస్తే.. గ్రీన్ సాస్‌తో కోట్ చేసిన ప్రోటీన్ రిచ్ మీట్, బ్రస్సెల్స్ మొలకలు, జుకినీ, బెల్ పెప్పర్స్, బ్రకోలీ, క్యారెట్లు వంటి కూరగాయలు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్లను అందిస్తూనే, శరీరంలో కొవ్వు పెరగకుండా చూస్తాయి. “తక్కువ తినండి.. ఎక్కువగా ప్రేమించండి.. కానీ ప్లేట్ మాత్రం పెద్దగా కనిపించేలా చూసుకోండి” అంటూ ఆయన ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Hrithik Roshan

Hrithik Roshan

నిపుణులు ఏమంటున్నారు?

ఈ విధానంపై బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఎడ్వినా రాజ్ స్పందిస్తూ.. కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆరోగ్యంగా ఉండటం అంటే కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదని, మనం తీసుకునే ప్లేట్‌లో పోషకాల సమతుల్యత ఉండాలని ఆమె తెలిపారు.

  • కార్బోహైడ్రేట్లు: అన్నం, చిరుధాన్యాలు, పండ్ల ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
  • ప్రోటీన్లు: పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు లేదా మాంసం కండరాల పుష్టికి తోడ్పడతాయి.
  • ఆరోగ్యకరమైన కొవ్వులు: నెయ్యి, నట్స్, గింజలు మెదడు, గుండె ఆరోగ్యానికి అవసరం.
  • పీచు పదార్థం (ఫైబర్): కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

అతిగా తగ్గించడం ప్రమాదకరం!

స్టార్ హీరో ఫాలో అవుతున్నారని అందరూ గుడ్డిగా తక్కువ తినేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ‘తక్కువ తినడం’ అనే పదాన్ని పట్టుకుని భోజనాన్ని స్కిప్ చేస్తే మెటబాలిజం మందగిస్తుంది. దీనివల్ల శరీరం బలహీనపడటమే కాకుండా నీరసం వస్తుంది. ఒక వ్యక్తికి కావాల్సిన ఆహారం అనేది వారి వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ప్లేట్ నిండా కూరగాయలు ఉంచుకుంటూనే, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ ఫిట్‌నెస్ ఫార్ములాను ఫాలో అవ్వాలనుకునే వారు పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్త పడాలి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.