
సౌత్ ఇండియన్ సినిమా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చర్మం పాల మీగడలా మెరుస్తూ, కాంతివంతంగా ఉంటుంది. అందుకే ఆమెను ‘మిల్కీ బ్యూటీ’ అని కూడా పిలుస్తారు. ఇంతటి అద్భుతమైన అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్‌ను తమన్నా స్వయంగా తన అభిమానుల కోసం పంచుకున్నారు. కెమికల్స్ లేని, ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే ఫేస్ మాస్క్‌లను తాను చిన్నప్పటి నుంచీ ఉపయోగిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ ఫేస్ మాస్క్‌లను వారానికి కొన్ని సార్లు వాడితే, నల్ల మచ్చలు, ముడతలు తగ్గి, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుందని ఆమె చెబుతున్నారు. తమన్నా తన తల్లి నుంచి నేర్చుకున్న ఆ రెండు అద్భుతమైన ఫేస్ మాస్క్‌లు, వాటి తయారీ విధానం, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెరిసే చర్మం కోసం..
ఈ ఫేస్ మాస్క్‌ను తయారుచేయడానికి, ఒక టీస్పూన్ గంధపు పొడి, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ కాఫీ పొడిని తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలను ఒక గిన్నెలో బాగా కలిపి, అవసరమైతే కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు ఆరిపోయే వరకు ఉంచి, ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఈ మాస్క్‌లోని గంధపు పొడి చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది, కాఫీ పొడి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాల వల్ల చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా, కాఫీ, చందనం రెండూ టానింగ్, నల్ల మచ్చలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసి, చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి.
ముడతల నివారణకు..
ఇది ముడతలు, జిడ్డు నివారణ కోసం ఉపయోగించే ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు, ముడతలు రాకుండా నివారించడానికి సహాయపడుతుంది. దీన్ని తయారుచేయడానికి, ఒక గిన్నెలో ఒక టీస్పూన్ శనగ పిండి, ఒక టీస్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.
ఈ పేస్టును ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌లోని శనగపిండి మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రోజ్ వాటర్‌లో ఉండే గుణాలు చర్మంలోని జిడ్డును తగ్గించి, ముడతలు రాకుండా నివారించడంలో సహాయపడతాయి. మిల్కీ బ్యూటీ తమన్నా పాటిస్తున్న ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే, మీరు కూడా సహజసిద్ధమైన అందాన్ని, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.