
ఇండస్ట్రీలోకి రావడానికి ప్రతి ఒక్కరికీ ఒక్కో ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. కొందరికి వ్యక్తులు అయితే మరికొందరికీ క్యారెక్టర్స్. కొందరికి సినిమా మీద ఉన్న ప్రేమ. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మనసుకు నచ్చిన క్యారెక్టర్ లేదా తన మనసులో నిండిన పాత్రను చేయాలని కోరుకుంటారు నటీనటులు. ఈ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సె కూడా అదే చెబుతోంది. అసలు ఏంటా పాత్ర.. ఎవరు చేశారు. తెలుసుకుందాం..
టాలీవుడ్ చరిత్రలో అరుంధతి సినిమా ఓ మైలురాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా విజయం సాధించగలవు అని చెప్పడానికి చక్కని ఉదాహరణ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా సినీప్రేక్షకులను అలరించడంతోపాటు జాతీయస్థాయిలోనూ ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఆ తరువాత ఎన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినా అరుంధతి సినిమాను బీట్ చేయలేకపోయాయి. అరుంధతి సినిమా ప్రేక్షకులకే కాదు, నటీనటులకు కూడా ఫేవరెట్.
తాజాగా ఓ యంగ్ హీరోయిన్ అరుంధతి సినిమా వంటి సినిమాలో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నాకు అరుంధతి లాంటి పవర్‌ఫుల్ హీరోయిన్-ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలనేదే పెద్ద కల. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ పాత్రలోని ధైర్యం, భయానకత, భావోద్వేగాలు నన్ను వణికించాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? 2009లో వచ్చిన అరుంధతి ఎందుకు ఇంత ప్రత్యేకం?
కల్ట్ క్లాసిక్..
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మహిళా కథానాయిక ప్రధానంగా వచ్చిన అరుదైన హారర్-ఫ్యాంటసీ థ్రిల్లర్. రెండు కాలాల మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన కథ, అరుంధతి, పశుపతి, జేజమ్మ, త్యాగం, పగ… ఇవన్నీ కలిపి అరుంధతి ఒక కల్ట్ క్లాసిక్‌గా మారింది. బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రమే కాదు, మహిళలు కూడా భారీ కథలు మోయగలరని రుజువు చేసిన సినిమా. ఆ ఒక్క సినిమాతోనే అనుష్క ఆ రోజుల్లోనే పాన్-ఇండియా స్టార్‌డమ్ సాధించారు. ఆ తర్వాత కూడా రుద్రమదేవి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అలాంటి పాత్రలో..
ఇప్పుడు మళ్లీ అరుంధతి లాంటి పాత్ర కోసం ఒక యంగ్ హీరోయిన్ ఆశపడటం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. తెలుగులో మిస్టర్ బచ్చన్‌తో డెబ్యూ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే భామ ఇటు దక్షిణాదితో పాటు అటు బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం రామ్ పోతినేనితో ఆంధ్రా కింగ్ తాలూక సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు సిద్ధమైంది. అయితే ఆమెకు ఇష్టమైన జోనర్ మాత్రం గ్లామర్ లేదా రొమాంటిక్ కాదు… హారర్-ఫ్యాంటసీ-పీరియాడిక్ యాక్షన్! ‘అరుంధతి లాంటి పాత్రలో నేను కత్తి ఎత్తుకుని, రక్తం చిందిస్తూ, దుష్టశక్తులతో పోరాడాలని ఉంది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అరుంధతి 2 లేదా అలాంటి భారీ ఫిమేల్ సెంట్రిక్ సినిమా తీస్తే… ఆ పాత్ర కోసం భాగ్యశ్రీని ఫిక్స్ చేయాలంటూ నెట్టింట ఫ్యాన్స్ చర్చ కూడా నడుస్తోంది. భాగ్యశ్రీ బోర్సె కోరిక ఏ సినిమాతో తీరుతుందో చూడాలి మరి!