
సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా అఖండ 2 : తాండవం. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా దీనిలోని అఖండ తాండవం పాటను విడుదల చేశారు మేకర్స్. ముంబయిలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బాలకృష్ణ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఉదయమే 3 గంటలకు లేస్తాను.. పూజలు చేస్తాను.. మూడుసార్లు హిందుపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. అభిమానులతో నాకున్న అనుబంధం ఎవరూ విడదీయరానిది. నేను చేసిన 4 సినిమాలు వరసగా విజయం సాధించాయి.. అఖండ నుంచి స్టార్ట్ అయింది.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ అన్నీ విజయాలే.. ఇప్పుడు అఖండ తాండవం వస్తుంది.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయిందని చెప్తున్నారు. ఈశ్వరుడి కృపతో ముందుకు వెళ్తున్నా.. నా డిక్షనరిలోనే సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు.. సనాతన ధర్మం, హిందూ ధర్మం గొప్పతనం గురించి అఖండ 2లో చూస్తారు. నిజాయితీగా నడువు.. ధర్మంగా బతుకు.. అన్యాయం ముందు తలవంచకు.. ఇదే అఖండ 2. డైరెక్టర్ బోయపాటితో హ్యాట్రిక్ ఉంది.. మేం ఎక్కువగా మాట్లాడుకోం.. కేవలం 130 రోజుల్లో సినిమా పూర్తి చేసాం.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను 73 రోజుల్లోనే పూర్తి చేసాం.. నాకు వేగంగా సినిమాలు చేయడమే ఇష్టం. అన్‌స్టాపుబల్ ప్రోగ్రామ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చా.. త్వరలోనే మళ్లీ స్టార్ట్ చేస్తా’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఇదే ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ.. ‘బాలయ్య గారి పాటలు అంటే ఛార్ట్ బస్టర్స్ కాదు హార్ట్ బస్టర్స్. సొసైటీలో, సినిమాల్లో ఆయన లెజెండ్. ఇది బ్యాలెన్స్ చేయడం కష్టం.. కానీ ఆయన చేస్తున్నాడు. ఆయనపై ఉన్న ప్రేమను మ్యూజిక్ రూపంలో ఇస్తున్నాను. ఈ సినిమా 250 కోట్లు వసూలు చేస్తుంది. అఖండ పార్ట్ 5 వరకు ఉంది స్క్రిప్ట్. గత 45 రోజులుగా నిద్ర లేకుండా పని చేస్తున్నాను నేను. బాలయ్య, బోయపాటి అంటే 500 రూపాయలు పెట్టి ఇంటర్వెల్ చూసి రావచ్చు. వాళ్లిద్దరికి కెమికల్ కాంబినేషన్, ఫిజికల్ స్టడీ లాంటిది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు.. అఖండ 2 ప్యాన్ యూనివర్స్ ఫిల్మ్.. ఎందుకంటే ఇది గాడ్స్ ఫిల్మ్’ అని అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శీను మాట్లాడుతూ.. ‘ముంబై కల్చరల్ రన్ వే ఆఫ్ సినిమా.. అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మొదలుపెడితే దేశమంతా ప్రమోషన్ పాకుతుందని మాకు తెలుసు. ఇది సినిమా కాదు భారతదేశ ఆత్మ. ఒక్కసారి సినిమా చూసాక మనం ఇంకా మాట్లాడుకుందాం’ అని అన్నారు.
నిర్మాత గోపీ మాట్లాడుతూ.. ‘ప్యాన్ ఇండియన్ హిట్ కోసం చూస్తున్నపుడు ముంబైను మించిన ప్రమోషనల్ ప్లాట్ ఫామ్ లేదు.. అందుకే ఇక్కడ్నుంచి స్టార్ట్ చేసాం. సనాతన ధర్మం గురించి తీసింది ఈ సినిమా.. దేశం నలుమూలలా వెళ్లాలి.. నార్త్ మీడియా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.