Most Recent

AP, Telangana News Live: ఊహకందని విషాదం.. విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట.. పెరుగుతున్న మృతుల సంఖ్య!

AP, Telangana News Live: ఊహకందని విషాదం.. విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట.. పెరుగుతున్న మృతుల సంఖ్య!

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. మరికొందరిని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. మరో 46 మందికిపైగా గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులోని కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్‌ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్‌.. ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. కొంత మందికి విజయ్‌ స్వయంగా వాటర్‌ బాటిల్స్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత చేయి దాటి.. భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితులతో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. భారీ జన సమూహంలో అతికష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆస్పత్రులకు తరలించారు.

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై విజయ్‌ ట్వీట్‌ చేశారు. తొక్కిసలాట ఘటనతో హృదయం ముక్కలైందన్నారు. దుఃఖం, బాధలో మునిగిపోయానని.. ఈ బాధ భరించలేనిది.. వర్ణించలేనిది అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు విజయ్‌ ప్రకటించారు.

కరూర్‌ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహా విషాద ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఘటనాస్థలంలో తక్షణ సహాయచర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఇవాళ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు సీఎం స్టాలిన్. అటు.. ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌ అయింది. రిటైర్డ్‌ జడ్జి అరుణ జగదీశన్‌ నేతృత్వంలో ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. అటు.. ర్యాలీకి పర్మిషన్‌ తీసుకున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక.. కరూర్‌ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం బాధాకరం అన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు ద్రౌపది ముర్ము. కరూర్‌ ఘోర విషాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని మోదీ. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాల కోసం ఇక్కడ వీక్షించండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.