
అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైలు పాలైన ఈ జంటకు గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడించంతో నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ మళ్లీ అరెస్ట్ అయ్యారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు ఈ ఇద్దరినీ మళ్లీ అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పవిత్రా గౌడను ఆమె ఇంట్లోనే అరెస్ట్ చేశారు. అనంతరం దర్శన్ బెంగళూరులోని హొసకెరెహళ్లిలోని తన భార్య ఇంటికి భార్య, కొడుకును కలిసేందుకు వెళ్లాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. భార్య ఉండగానే, నటి పవిత్రగౌడతో సహజీవనం చేస్తున్న దర్శన్ భవిష్యత్తును పాడు చేస్తున్నావంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి (30) నటి పవిత్రకు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాలు పంపించాడు. అయితే రేణుకాస్వామి పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతో దర్శన్ అతడిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశాడు. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు.
అయితే ఈ కేసులో దర్శన్, పవిత్రాగౌడతో సహా మొత్తం ఏడుగురికి కర్ణాటక హైకోర్టు గతేడాది బెయిల్ ఇవ్వగా.. సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. వెన్నునొప్పికి అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలన్న కారణంతో బెయిలుపై బయటకు వచ్చిన దర్శన్ ‘డెవిల్’ అనే మువీ చిత్రీకరణలో పాల్గొనడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విదేశాలకు వెళ్లడం, దేశ వ్యాప్తంగా పలు గుడులు, ఆలయాలకు వెళ్లడం కోర్టు దృష్టికి రావడంతో.. అసలు ఆయన బెయిల్ ఎందుకు తీసుకున్నాడు? చేస్తున్నదేంటి? అని ప్రశ్నించింది. అనంతరం పవిత్ర గౌడ (ఏ1), దర్శన్ (ఏ2), జగదీశ్ ఎలియాస్ జగ్గ (ఏ6), అనుకుమార్ (ఏ7), ప్రదోష్ (ఏ14), నాగరాజ్ (ఏ11), లక్ష్మణ్ (ఏ12)ల బెయిల్‌ను ధర్మాసనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రద్దు సమయంలో నిర్ణీత గడువులోగా లొంగిపోవాలనే వెసులుబాటును కోర్టు వీరికి కల్పించలేదు. దాంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను అరెస్టు చేశారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.