
సినిమాను నిర్మించిన తర్వాత దానిని ప్రమోట్ చేయడమే అసలైన టాస్క్. సినిమాలో దమ్ములేకపోయినా పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్లాక్‌బస్టర్స్‌గా నిలబెట్టిన ఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలు. యూట్యూబ్ వ్యూస్‌పై కూడా ప్రకటనలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచడానికి చూస్తుంటారు మేకర్స్. ఇకనుంచి ఇలాంటి ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టాలని పిలుపు నిచ్చారు దిల్ రాజు. యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పి.. ఇకనైనా మారుదామంటూ నిర్మాతలకు కీలక సూచనలు చేశారు.
ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. యూట్యూబ్‌లో రికార్డులంటూ చెప్పడం సాధారణమైపోయింది. అయితే అందులో చాలా వరకు పెయిడ్ వ్యూసే అని కుండ బద్దలు కొట్టేశారు నిర్మాత దిల్ రాజు. నిజానికి ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచడం కోసం ఇరవై నాలుగు గంటల్లో లేదా వారం రోజుల్లో ఇన్ని వ్యూస్ తో రికార్డులు బద్దలయ్యాయని చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్లు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. డబ్బులు ఖర్చవ్వడంతో పాటు నెంబర్లు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినా మళ్ళీ హీరోలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పి లేకుండా జెన్యూన్‌గా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని చూపించాలని… తమ్ముడు సినిమాకి అదే ఫాలో అవుతానన్నారు దిల్ రాజు. యూట్యూబ్ వ్యూస్‌ని కొనేసుకుని మిలియన్ల కొద్దీ చూశారనే ఫేక్ ప్రచారాలు ఇకపై ఆగాలని, డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మందికి రీచ్ అయ్యిందని చెప్పుకోవడంలో అర్థం లేదన్నారు.
నిర్మాతలు కథలపై చర్చించకుండా.. ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో ఉంటున్నారని దిల్ రాజు అన్నారు. మూవీ ఎకనమిక్స్ గురించి కూడా హీరోలను కూర్చోబెట్టి మాట్లాడాలని సూచించారు. హీరోలు, దర్శకులు రీజనబుల్‌గా రెమ్యూనరేషన్లు తీసుకోవాలని కోరారు.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు తెలిపారు. టికెట్ రేట్లపై పవన్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదన్నారు.
మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక కీలక మార్పు అవసరమని నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అలాగే యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పి.. విషయం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని ఆయన నొక్కి చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి