
పుష్ప 2 ప్రిమియర్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించి.. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి చేశాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించారు. దీంతో బాలుడ్ని న్యూరో-రిహాబ్ సేవల కోసం రాంగోపాల్‌పేటలోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.
2024, డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె తనయుడు శ్రీతేజ్ గాయాలపాలై.. అప్పటినుంచి చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‌కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కొనసాగింది.
ఇన్ఫెక్షన్లు లేకుండా బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కళ్లు తెరిచి చూస్తున్నాడని.. ద్రవరూపం ఫుడ్ అందిస్తున్నట్లు వివరించారు. తమను ఇంకా గుర్తుపట్టే పరిస్థితిల్లో లేడని.. డాక్టర్ల సూచన మేరకు రిహాబిలిటేషన్‌కు తరలిస్తామన్నారు. బాబు చికిత్స కోసం తమ వద్ద నుంచి కిమ్స్ ఆస్పత్రి ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపారు. కష్టకాలంలో తమకు తోడు నిలిచిన అందరికీ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13న అరెస్టు చేశారు. అయితే, హైకోర్టు తరువాత అతనికి బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.