నమ్మినవాళ్లే మోసం చేస్తే ఏడుస్తూ ఉండకూడదని.. మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలని అన్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా పూరి మ్యూజింగ్స్ పేరుతో అనేక అంశాలపై తనదైన ఆలోచనలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి మ్యూజింగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో ఏదోక అంశంపై మాట్లాడుతుంటారు పూరి. తాజాగా ప్రేమలో విఫలమైతే కోలుకోవడం.. నమ్మినవాళ్లే మోసం చేస్తే వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ చెప్పుకొచ్చారు.
“కొన్నిసార్లు శరీరానికి అనేక దెబ్బలు తగులుతాయి. ఏం జరిగినా వెంటనే మన బాడీ వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. మరికొన్ని నయం కావడానికి వారాలు పట్టొచ్చు. కొన్ని చచ్చిపోతే కొత్తవి పుట్టుకోస్తాయి. అలాగే కొన్నిసార్లు మన గుండెకు దెబ్బలు తగులుతాయి. కన్నతండ్రి చనిపోవచ్చు. కష్టపడిదంతా గంగలో కలిసిపోవచ్చు. నమ్మినవాళ్లు మోసం చేయొచ్చు. వీటిని మనమే నయం చేసుకోవాలి. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. ఏం జరిగినా.. ఎంత అనర్థం జరిగినా త్వరగా మాములు మనిషిగా మారాలి. మానసికంగా ధృఢంగా ఉండాలి. రోజులతరబడి ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి. ? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు వచ్చేయ.. మనల్ని ఎవరూ ఓదార్చకూడదు.. ఎవరో సానుభూతి కోసం ఎప్పుడూ ఎదురుచూడొద్దు. మనకు మనమే ధైర్యం చెప్పుకొవాలి. కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి.. కానీ ఆ వెంటనే పనిలో బిజీగా మారండి. ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిసలవుతారు. దయచేసి అలా చేయకండి. ఎంత నష్టం వచ్చినా ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంతో కష్టం వచ్చినా ఒత్తిడిగా భావించొద్దు.
అలాగే అన్నం తినడం మానొద్దు. ఎక్కువగా నీళ్లు తాగడం మంచింది. కావాల్సినంత నిద్రపోవాలి. శరీరం కోరుకునే అవసరాలు తీర్చాలి. అలా చేస్తే మనం కోలుకుంటాం. ఏం జరిగినా ఆ తర్వాత ఆ ఏంటీ అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. నువ్వు చనిపోతున్నావని గంట ముందు తెలిసినా.. తర్వాత ఏం చేయాలో అది చేసేయ్… ఎందుకంటే ఇవన్నీ మనం బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు. ఊపిరి వదిలేవరకు వీటిని భరించాల్సిందే. ఎవరికి వారే నచ్చచెప్పుకోవాలి. అలా చేసినవారు అందరికంటే గొప్పవారు “అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూరి చెప్పిన మాటలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు పూరీ. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్నారు.