Most Recent

Bhamakalapam 2: ప్రియమణి ‘భామా కలాపం 2’ రివ్యూ.. బ్లాక్ బస్టర్ హిట్ సిక్వెల్ ఎలా ఉందంటే..

Bhamakalapam 2: ప్రియమణి ‘భామా కలాపం 2’ రివ్యూ.. బ్లాక్ బస్టర్ హిట్ సిక్వెల్ ఎలా ఉందంటే..

మూవీ రివ్యూ: భామాకలాపం 2

నటీనటులు : ప్రియమణి, శరణ్య ప్రదీప్, అనూజ్ గుర్వారా, సీరత్ కపూర్, సందీప్ వేద్ తదితరులు

సినిమాటోగ్రఫర్: దీపక్ యారగెరా

సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి

నిర్మాతలు : బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర

కథ, స్క్రీన్‌ప్లే: అభిమన్యు తడిమేటి

దర్శకత్వం : అభిమన్యు తడిమేటి

ఓటీటీ ప్లాట్‌ఫాం : ఆహా

2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భామాకలాపం. ఆహాలో వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా దీనికి సీక్వెల్ తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆహాలో ఇది స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. మొదటి భాగం మాదిరే ఆకట్టుకుందా అనేది చూద్దాం..

కథ:

భామాకలాపం కథ ఎక్కడైతే ముగిసిందో.. సరిగ్గా అక్కడ్నుంచే సీక్వెల్ కథ మొదలవుతుంది. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిన తర్వాత అనుపమ (ప్రియమణి) జీవితం ఊహించిన దానికంటే మరింత ఆనందంగా మారుతుంది. పాత ఇంట్లో ఉన్న పనిమనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) తోడుగా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ ప్రారంభిస్తుంది. ఇద్దరూ కలిసి కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ షోకు అప్లై చేస్తారు. ఇదిలా ఉంటే ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ పేరుతో యూరప్ నుంచి డ్రగ్స్‌ స్మగ్లింగ్ చేయాలనుకుంటాడు. ఇక తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా (సీరత్ కపూర్) ఐదేళ్లుగా ఆంథోని లోబోతో ఉంటుంది. కథ ఇలా సాగుతున్న సమయంలో.. ఈ డ్రగ్స్‌ను అనుపమ కొట్టేస్తుంది. అసలు ఆమెకు ఆ అవసరం ఏమొచ్చింది.. ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అనేది అసలు కథ..

కథనం:

సీక్వెల్ చేస్తున్నపుడు వద్దన్నా అంచనాలు భారీగా పెరిగిపోతాయి. భామా కలాపం సినిమా విషయంలో ఇదే జరిగింది. ఫస్ట్ పార్ట్ అంతా కేవలం ఒకే అపార్ట్‌మెంట్‌లో జరుగుతుంది. అందులోనే మర్డర్ మిస్టరీగా తెరకెక్కింది. కానీ సెకండ్ పార్ట్ అలా కాదు.. దీని జోనర్ మార్చేసారు.. రేంజ్ మార్చేసారు.. స్మగ్లింగ్‌తో ముడిపెట్టి థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు అభిమన్యు. మొదట్లో మామూలుగానే ఉన్నా.. మెల్లగా కథలో వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా ఒక్కో సీన్ రివీల్ అవుతుండటం.. కుకింగ్ షో నుంచి డ్రగ్స్ వైపు కథ సాగడం ఆసక్తి రేకెత్తిస్తుంది. అనుపమ కథతో పాటు ట్రోఫీ కథ.. ఇంకో పోలీస్ ఆఫీసర్ స్టోరీ అన్నీ సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు. ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల మధ్య వచ్చిన ప్రతీ సీన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్. బయట నుంచి ఒకరు ఉండి టీమ్‌ను నడిపించడం.. లోపల ఉన్నవాళ్లు దొంగతనాన్ని చేయడం.. ఇవన్నీ బాగానే ఉంటాయి. మెయిన్ థీమ్ అయిన.. హెయిస్ట్ ఎపిసోడ్ ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తుంది. ప్రియమణి మల్టీ టాస్కింగ్, ఆ సమయంలో శరణ్య ప్రదీప్ కన్ఫ్యూజన్ నవ్వు తెప్పిస్తుంటాయి. ఫస్టాఫ్ అంతా ఫన్‌తో పాటు ఎగ్జైటింగ్‌గానూ సాగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అంతే పకడ్బందీగా రాసుకున్నారు. ఫస్ట్ పార్ట్ అపార్ట్‌మెంట్.. సెకండ్ పార్ట్ బయట చేస్తే.. మూడో భాగం ఏకంగా విదేశాల్లో ఉంటుందన్నట్లు చూపించారు. ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల క్యారెక్టరైజేషన్స్ ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్.

నటీనటులు:

ప్రియమణి మరోసారి ఆకట్టుకున్నారు. ఇంటెలిజెంట్ హౌస్ వైఫ్ పాత్రలో ఆమె అదుర్స్ అంతే. సెకండ్ పార్ట్‌లో ఆమె నటన మరింత ఆకట్టుకుంటుంది. అనుపమ పాత్ర సాగిన విధానం అద్భుతంగా ఉంటుంది. శరణ్య ప్రదీప్ పాత్ర మొదటి భాగం కంటే ఇంకొంచెం ఫన్నీగా ఉంటుంది. సీరత్ కపూర్, సందీప్ వేద్, అనూజ్ గుర్వారా, రఘు ముఖర్జీ, రుద్ర ప్రదీప్ అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బాగుంది. ముఖ్యంగా స్వప్న సుందరి పాట వినటానికి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఆర్ఆర్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యారగెరా విజువల్స్ బాగా తీశారు. ఓటిటి ప్రాడక్ట్ అయినా.. ఎక్కడా తక్కువ క్వాలిటీ కనిపించదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు అభిమన్యు వర్క్ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. సీక్వెల్‌లో కాస్త తగ్గినట్లు కానీ బాగుంటుంది. ఎక్కడా బోర్ అయితే అనిపించదు. వీకెండ్‌లో హాయిగా చూసేయొచ్చు.

పంచ్ లైన్:

భామాకలాపం 2.. వీకెండ్‌లో మంచి కాలక్షేపం..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.