దేశవ్యాప్తంగా అయోధ్య వైపే చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో కోట్లాది రామ భక్తుల కల తీరనుంది. దాదాపు 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నం అయింది. ఈ నేపథ్యంలో అన్ని దారులు అయోధ్యపురివైపు.. రామ మందిరంలో గర్భ గుడిలో బాల రాముడు ప్రాణప్రతిష్టకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఎంతో మంది ప్రముఖులను శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఇదే సమయంలో రామజన్మభూమి వివాదంపై తుది తీర్పును వెలువరించిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం అందింది. రామ మందిరం ప్రారంభోత్సవ వేళ దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
పలువురు ప్రముఖుల హాజరు
దేశ వ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు అయోధ్యకు తరలి వస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజాలకు, సినీ ప్రముఖులకు, రాజకీయ నేతలకు, ఉన్నతాధికారులకు, దౌత్యాధికారులకు… మొత్తం సుమారుగా 8వేల మందికి ఆహ్వానాలు అందాయి. వారిలో అత్యంత ప్రముఖులు సుమారు 100మంది దాకా ఉన్నారు.
రామజన్మభూమి వివాదంపై తుది తీర్పును వెలువరించిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం అందింది. 22న జరిగే అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఐదుగురు న్యాయమూర్తులను శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది.
న్యాయమూర్తులకు ఆహ్వానం
2019, నవంబర్ 9 న అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రామజన్మభూమి వివాదంపై చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రామమందిరం తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఇతర న్యాయమూర్తులు.. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐ ఎస్ఏ బాబ్డే, ప్రస్తుత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ఉన్నారు.
వివాదాస్పద రామమందిరం స్థలం మొత్తాన్ని రామమందిరం ట్రస్ట్‌కే ఇవ్వాలని అప్పట్లో సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ముస్లింలకు మసీద్ కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని సైతం తీర్పులో పేర్కొంది. బాలరామమందిరం ప్రాణప్రతిష్టకు 100 మందికి పైగా మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఆహ్వానం అందింది.
తరలి వస్తున్న దిగ్గజాలు
అయోధ్య ఆలయ ప్రతిష్ఠకు ప్రముఖ నటుడు అమితాబచ్చన్ ప్రత్యేక విమానంలో తరలిరానున్నారు. ఆహ్వానం అందుకున్న సినీ ప్రముఖుల్లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, చిరంజీవి, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్ తదితరులు ఉన్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ కుమార మంగళం బిర్లా, పిరమల్ గ్రూప్ చైర్‌పర్సన్ అజయ్ పిరమల్, ఆనంద్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కే సతీశ్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈఓ ఎస్ ఎన్ సుబ్రహ్మణియన్, ఆయన భార్య, దివీస్ లేబొరెటరీస్ మురళి దివి, ఇన్ఫోసిస్ స్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి తదితరులు ఉన్నారు. పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలు పార్టీల నేతలు హాజరు కానున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..