
నయనతార అనగానే స్టార్ హీరోయిన్.. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ప్రమోషన్స్ కు రాదు.. 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ టాప్ హీరోయిన్.. ఇలా అన్ని చెప్తుంటారు. కానీ ఇవన్నీ అందరూ చెప్పేవే కదా.. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కూడా బోర్ కొడుతుంది. అందుకే నవంబర్ 18న ఆమె పుట్టిన రోజు సందర్భంగా నయనతార జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనలు, ఆసక్తికరమైన విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడంటే నయనతార అందరికీ తెలుసు కానీ.. కెరీర్ ప్రారంభంలో ఆమె పడిన కష్టాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
నయనతార అసలు పేరు డయానా మరియన్ కురియమ్. కెరీర్ మొదట్లో తన మాతృభాషలో ‘మనసీనక్కరే’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలామందికి తెలియదు. తెలిసినా అందులో నయనతార నటించినట్టు అసలే ఐడియా లేదు. అప్పట్లో ఈ సినిమా దర్శకుడు సత్యన్.. డయానా అనే పేరు నచ్చక.. ఒక రోజంతా ఆలోచించి ఆమెకు నయనతార అని నామకరణం చేశారు. ఒక సినిమా చేసిన తర్వాత కూడా నయనతారకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మలయాళంలోనే ఒక లోకల్ టీవీ ఛానల్ లో కొన్ని రోజులు యాంకర్‌గా వర్క్ చేసింది. ఒకప్పటి ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత శరత్ కుమార్ హీరోగా వచ్చిన అయ్యా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా.. వెంటనే మురుగుదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది నయనతార. అక్కడి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది.
ఇక చంద్రముఖిలో రజనీకాంత్ కు జోడిగా నటించిన తర్వాత సౌత్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది నయనతార. వెంటనే తెలుగులో కూడా లక్ష్మీ, యోగి, దుబాయ్ శీను, సింహం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేసింది నయనతార. తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా ఇప్పటికీ నయనతార వెనకే ఉన్నారు కానీ.. ఆమెను మాత్రం క్రాస్ చేయలేకపోయారు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా సినిమాకు దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది అంటే నయన్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పేరుకు క్రిస్టియన్ అయినప్పటికీ అందరూ దేవుళ్లను నమ్మేది నయనతార. ముఖ్యంగా హిందూ మతంపై ఆమెకు చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేది. అప్పట్లో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన శ్రీ రామరాజ్యంలో సీత పాత్రకు పూర్తి న్యాయం చేసింది నయనతార. ఒకవైపు గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ తనకు ఈ జనరేషన్ లో పోటీ ఇచ్చే హీరోయిన్ ఇంకెవరూ లేరు అని ఎన్నోసార్లు నిరూపించుకుంది నయనతార. సినిమాల పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా పర్సనల్ లైఫ్ లో మాత్రం నయనతార ఎప్పుడూ ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
ముఖ్యంగా ప్రేమ ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. మొదటిసారి శింబు, రెండోసారి ప్రభుదేవా ఇద్దరితోనూ పెళ్లి వరకు వెళ్లిన ప్రేమ పెటాకులైంది. ఆ తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసి గతేడాది పెళ్లి చేసుకుంది నయనతార. ఈ మధ్య కవల పిల్లలకు తల్లిగా మారింది. జవాన్ సినిమాతో ఈయడాది బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ కూడా ఈమె హవా మొదలైంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని నయనతార కు టీవీ9 తరఫు నుంచి హ్యాపీ బర్త్ డే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.