
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆనుమానాస్పద మృతి బాలీవుడ్‌ను విషాదంలో నెట్టేసింది. అకస్మాత్తుగా ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారో తెలీక పలువురు విచారంలో కూరుకుపోయారు. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు పని చేశారు నితిన్. నితిన్ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, అప్పుల భారంతో నితిన్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 252 కోట్లు..అయితే 2016, 2018 సంవత్సరాల్లో నితిన్ సీఎఫ్ఎం ఫైనాన్స్ సంస్థ నుంచి మొత్తం రూ.180 కోట్లను అప్పుగా తీసుకున్నారట. దీని కోసం 42 ఎకరాల స్థలం, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టారు.
ఈ మొత్తాన్ని ఆయన సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో సీఎఫ్ఎం సంస్థ ఈ అప్పు రికవరీ చేసే బాధ్యతను ఎడల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థకు అప్పగించింది.దీంతో ఎడల్‌వీస్ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా అప్పు రికవరీ ప్రక్రియ ప్రారంభించేందుకు ట్రిబ్యునల్ అనుమతించింది. నితిన్ మొత్తం 252 కోట్లు బాకీ పడ్డట్టు ఈ విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో రుణభారం తట్టుకోలేకే ఆయన బలవంతంగా తనువు చాలించి ఉంటారని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నిన్న ఉదయం తన స్టూడియోలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి హిట్ మూవీస్ కు నితిన్ దేశాయ్ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు.హిందీ, మరాఠీ భాషల్లో సినిమాలకు పని చేసి ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఆయన పని చేసిన ఎన్నో చిత్రాలకు జాతీయ అవార్డులు రాగా.. వ్యక్తిగతంగా ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పని చేశారు. మరాఠీ భాషలో ఆయన సినిమాలు చేశారు. అలాగే కొన్ని సినిమాలో నటించారు కూడా.. నితిన్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.