

ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన టాలీవుడ్ సెలబ్రిటీల్లో ప్రముఖ నటి ఝాన్సీ ఒకరు. తెలుగునాట స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన ఆమె నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తెలుగు తెరపై రాణిస్తున్నారు. ఇటీవలే దసరా సినిమాలో కీర్తి సురేశ్ తల్లిగా రమణమ్మ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న ఝాన్సీ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఆటు పోట్లు ఎదుర్కొన్నారు. నటుడు జోగినాయుడిని ప్రేమంచి పెళ్లి చేసుకున్న ఝాన్సీ కూతురు పుట్టాక అతనితో విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ మదర్‌గానే లైఫ్‌ను లీడ్ చేస్తున్నారామె. అయితే జోగినాయుడు మాత్రం రెండో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించింది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జోగి నాయుడు తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యారు. ఝాన్సీతో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బ్రహ్మానందం తండ్రిలా నిలబడి..
‘1995లో ఝాన్సీ నాకు మొదటిసారిగా పరిచయమైంది. జీకే మోహన్ తీసిన ఓ మూవీలో ఆమె నటించింది. ఆ సమయంలో నేను జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నాను. అప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది. ఆతర్వాత దాదాపు తొమ్మిదేళ్లపాటు మేమిద్దరం కలిసే ఉన్నాం. కానీ ఇద్దరం మంచి స్టేజీకి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఏడాదిలోనే విడిపోవాల్సి వచ్చింది. అప్పటికి మాకు ధన్య అనే కూతురు ఉంది. ఝాన్సీతో కలిసుండాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అది జరగలేదు. మా బంధం అంతవరకే అని రాసిపెట్టుందేమో అనుకున్నా. బ్రహ్మానందం ఒక తండ్రి స్థానంలో మమ్మల్ని కలిపేందుకు చాలా ప్రయత్నించారు. అలాగే చిరంజీవి కూడా మా ఇద్దరినీ కూర్చోబెట్టి రెండు,మూడు గంటలపాటు మాట్లాడారు. కానీ ఏం వర్కవుట్ అవ్వలేదు. ఆమెతో నడిచిన ప్రయాణంలో జీవితకాలం సరిపడా జ్ఞాపకాలు పోగేసుకున్నాను. ఝాన్సీతో కలవడం జరగని పని అని అర్థమయ్యాకే అమ్మానాన్న చెప్పిన మాట విని రెండో పెళ్లి చేసుకున్నాను. అయితే నా కూతురు దూరమైపోయిందన్న బాధ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడున్న ఇద్దరు ఆడపిల్లలో తనను చూసుకుంటున్నాను’ అని ఎమోషనల్ అయ్యాడు జోగినాయుడు.
జోగి నాయుడు ఫ్యామిలీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..