
Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతోన్న సమయంలో జరిగిన ప్రమాదంలో వీరిద్దరికి గాయాలయ్యాయని వినిపిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన చిత్ర యూనిట్ వారికి ప్రాథమిక చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారని పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాన్ని ప్రచురించాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ యూనిట్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఆ వార్త కథనాల ప్రకారం.. నదికి రెండు వైపులా ఉన్న ఓ రోప్ బ్రిడ్జ్ మీదుగా వాహనం నడపాల్సి ఉండగా. అనుకోకుండా ఆ తాడు తెగి వాహనంతో సహా కింద పడిపోయారని, దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అటు సమంత, ఇటు విజయ్ ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..