Most Recent

200 సినిమాల్లో గయ్యాళి పాత్రలు.. తెరపై కడుపుబ్బా నవ్వించిన ఛాయా దేవి.. చావు బతుకుల మధ్య అనాథగా..

200 సినిమాల్లో గయ్యాళి పాత్రలు.. తెరపై కడుపుబ్బా నవ్వించిన ఛాయా దేవి.. చావు బతుకుల మధ్య అనాథగా..

తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణయుగంలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన మహానటి ఛాయాదేవి. గయ్యాళి పాత్రల నుంచి హాస్య పాత్రల వరకు, సాత్విక పాత్రల నుంచి కుట్ర కోణమున్న విలనీ పాత్రల వరకు అనేక విభిన్న షేడ్స్‌ను పండించి, తన ప్రతిభను చాటుకున్నారు. అయితే, ఆమెకు దక్కాల్సినంత గుర్తింపు, ఆదరణ దక్కలేదన్నది ఒక విషాద సత్యం. సూర్యకాంతమ్మతో తరచుగా పోల్చబడుతూ, ఆమె నీడలో కొంతకాలం నడవాల్సి వచ్చినా, ఛాయాదేవి తనదైన శైలిని కలిగి ఉన్న ప్రత్యేక నటి. ఛాయాదేవి గుంటూరులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే నాట్యంపై ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది. ఆంధ్రదేశంలో పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమెకు సినీ అవకాశం లభించింది. చదలవాడ నారాయణరావు నటించిన దీనబంధు చిత్రంతో 1942లో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, ఎన్టీఆర్ నటించి నిర్మించిన పిచ్చి పుల్లయ్య (ఎన్.ఏ.టి బ్యానర్‌పై) ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆమె వితంతువు జమీందారిణి పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు.

ఛాయాదేవి గయ్యాళి, హాస్య పాత్రలను పోషించడంలో ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నారు. గుండమ్మ కథలో దుర్గమ్మగా, లక్ష్మి (సావిత్రి)తో ఫైటింగ్‌కు దిగే సన్నివేశం, ఇది పిడకలు కొట్టిన చేతులే అనే డైలాగ్‌కు సమాధానంగా ఇవి జొన్నలు దంచిన చేతులే అంటూ లక్ష్మి చెప్పే సన్నివేశంలో సూర్యకాంతమ్మ, సావిత్రిలతో పోటీపడి నటించి మెప్పించారు. ఈ చిత్రంలో భర్త వదిలేసిన పాత్రను ఆమె పోషించారు. అలాగే, మాయాబజార్లో రేవతి పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ పాత్రకు కె.వి.రెడ్డి ఛాయాదేవిని ఎందుకు ఎంచుకున్నారంటే, శశిరేఖ పాత్రధారిణి సావిత్రి లావుగా ఉండడం వల్ల, ఆమె తల్లి పోలికలు ఉండాలని ఛాయాదేవిని తీసుకున్నారని వివరించారు. ఈ సినిమాలో గుమ్మడితో కలిసి లాహిరి లాహిరి లాహిరిలో పాటలో ఆమె నౌకా విహారం చేస్తూ కనిపించే తీరు, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పరమానందయ్య శిష్యుల కథలో కాంతం పాత్ర, కన్యాశుల్కంలో పూటకూళ్లమ్మ పాత్ర, గిరీశం (ఎన్టీఆర్)తో ఆమె సన్నివేశాలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. సుమారు 200 చిత్రాలలో గయ్యాళి, హాస్య పాత్రలు పోషించినా, ప్రతి పాత్రకూ ఆమె ప్రత్యేకతను అందించారు. ఆమె నటనలో, మాటల్లో కనిపించే విలనిజం ప్రజలను ఎంతగానో భయపెట్టేది.

ఛాయాదేవిని తరచుగా సూర్యకాంతమ్మతో పోల్చేవారు. గయ్యాళి పాత్రలు పోషించడంలో ఇద్దరూ దిట్టలే. అయితే, వారి నటనలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. సూర్యకాంతమ్మ గయ్యాళి పాత్రలతో పాటు హాస్యం, అమాయకత్వం ఉన్న పాత్రలను కూడా పోషించారు. ఛాయాదేవి కూడా కొన్ని సాత్విక పాత్రలను చేశారు. కానీ, వారి నటన తీరు భిన్నంగా ఉండేది. సూర్యకాంతమ్మ పాత్రలలో స్వార్థం డామినేట్ చేస్తే, ఛాయాదేవి పాత్రలలో కుట్ర కోణం స్పష్టంగా కనిపించేది. సూర్యకాంతమ్మ ఎంత విలనీ పండించినా, చివరికి ఆమె పశ్చాత్తాపపడితే ప్రేక్షకులు ఆమెను క్షమించేవారు. కానీ, ఛాయాదేవి పాత్రలు చేసిన పనులకు పోలీసులు వచ్చి పట్టుకుపోతే బాగుండును అనిపించేంత విలనిజం పండించేవి. సూర్యకాంతమ్మకు లభించినంత పాపులారిటీ, ఆదరణ ఛాయాదేవికి లభించలేదనే చెప్పాలి. పరిశ్రమ, ప్రేక్షకులు మాత్రమే కాదు, ఆ రోజుల్లో మీడియా కూడా ఛాయాదేవి గురించి అంతగా పట్టించుకోలేదు. ఆమె ఇంటర్వ్యూలు, ప్రత్యేక వ్యాసాలు చాలా అరుదు.

ఛాయాదేవి వివాహం చేసుకోలేదు. విజయవాడలో నాట్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో ఆమె సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా సహజీవనం చేశారు. వారికి పిల్లలు లేరు. మహానటుడు ఎస్వీ రంగారావుతో ఆమెకున్న స్నేహం గురించి, వారి అనుబంధం గురించి ఆ రోజుల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నా, వారు వాటిని పట్టించుకోలేదు. ఇతరులకు సాయం చేసే గుణం ఛాయాదేవిలో పుష్కలంగా ఉండేది. జీవితంలో దెబ్బతిని తన దగ్గరకు సాయం కోసం వచ్చినా, లేదా వారి గురించి తెలిసినా, ఆమె తనకు తోచిన సాయం చేసేవారు, అండగా నిలిచి ధైర్యం చెప్పేవారు. నటిగా డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బును వడ్డీలకు తిప్పి, సినీ అవకాశాలు తగ్గిన తర్వాత వాటినే జీవనాధారంగా చేసుకున్నారు. అయితే, ఛాయాదేవి జీవిత చరమాంకం మాత్రం దుర్భరంగా గడిచింది. ఆమెకు ఎవరూ లేకపోవడం, పరిశ్రమ పట్టించుకోకపోవడం ఆమెను శారీరకంగా, మానసికంగా కృంగదీశాయి. వడ్డీలకు డబ్బు తీసుకున్నవారు మోసం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. దానికి తోడు మధుమేహ వ్యాధి ఆమెను బాధించింది. కాలి వేలికి తగిలిన దెబ్బ వల్ల చివరికి ఆ కాలును కోల్పోవాల్సి వచ్చింది. ఆస్తులు కరిగిపోవడం, అనారోగ్యం, చూసే దిక్కు లేకపోవడం వంటి సమస్యలతో చివరికి 1983 సెప్టెంబర్ 4న ఛాయాదేవి అనామకంగా కన్నుమూశారు. ఆమె మరణవార్తను చిత్ర పరిశ్రమ అంతగా పట్టించుకోలేదు. కొన్ని సినిమా పత్రికలు తప్ప మిగిలినవి ఆమెకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆమె ఒంటరి కావడంతో, వడ్డీలకు డబ్బు తీసుకున్నవారు ఎగ్గొట్టారు. ఇల్లును అద్దెకి తీసుకున్నవారు సొంతం చేసుకున్నారు. అలా అనేక ఇబ్బందులతో ఆమె చనిపోయారు. ఇండస్ట్రీలో బాగున్నప్పుడే అంతా పలకరిస్తారు. బాగోలేకపోతే పట్టించుకోవడం మానేస్తారు. ఛాయాదేవి విషయంలోను అదే జరిగింది అని గతంలో ఓ ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.