
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో శస్త్ర చికిత్స చేయించుకున్నారట.. దాని ప్రభావం కంటి మీద కూడా పడిందట. ఇంకేదో మరోసారి చికిత్స అవసరం అంటున్నారట.. గత కొన్ని రోజులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. కానీ అసలు ఏమైంది? ఏ శస్త్ర చికిత్స జరిగింది? పరిస్థితి ఎంత సీరియస్? ఎంతకాలం విశ్రాంతి అవసరం? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం మాత్రం బయటకు రాలేదు. శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు కూడా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. దీంతో అనుమానాలు, ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ భేటీ సందర్భంగా ఇప్పటివరకు బయటకు రాని పూర్తి వివరాలను పవన్ కళ్యాణ్ స్వయంగా ముఖ్యమంత్రికి వెల్లడించారు. సుమారు 15 రోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల స్వాగతం పలికారు. అనంతరం ఆత్మీయంగా జరిగిన భేటీలో ఆరోగ్య పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి అడిగిన వెంటనే తనకు ఎదురైన సమస్యలన్నింటినీ పవన్ కళ్యాణ్ వివరంగా చెప్పారు.
కేవలం సైనస్ అని అనుకున్నా కానీ..
మొదట్లో ఇది సాధారణ సైనస్ సమస్యగా భావించానని, కానీ తర్వాత అది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారిందని పవన్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఆ ఇన్ఫెక్షన్ కంటి ప్రాంతంపై ప్రభావం చూపడంతో పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారిందని దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారని డిప్యూటీ, సీఎంకు వివరించారు. ఈ క్రమంలో తనకు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. సైనస్‌లో పేరుకుపోయిన ఇన్ఫెక్షన్‌ను తొలగించి, శ్వాస మార్గాలను శుభ్రం చేయడానికి ఈ శస్త్ర చికిత్స చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయినప్పటికీ, ఇంకా కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ కొనసాగుతోందని, మరో వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెప్పినట్లు వివరించారు.
ఒక్క సైనస్ నే కాకుండా..
అయితే తన ఆరోగ్య సమస్యలు ఇక్కడితో ముగియలేదని పవన్ కళ్యాణ్ సీఎం కు చెప్పడం అభిమానుల్లో ఆవేదన కలిగించింది. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో తగిలిన గాయాలు ఇప్పటికీ బాధిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా భుజం దగ్గర మజిల్‌కు సంబంధించిన గాయాలు గత అయిదేళ్లుగా ఉన్నాయని, అప్పట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు అవే సమస్యలు మళ్లీ తీవ్రమవుతున్నాయని వెల్లడించారు. వైద్యులు తనకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని నిర్ధారించారని, దీని వల్ల భుజం కదలికల్లో ఇబ్బందులు, నొప్పి ఉంటోందని వివరించారు. దీనికి కూడా చికిత్స అవసరమని, అవసరమైతే శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు సీఎం కు చెప్పారు పవన్ కళ్యాణ్.
వైద్యుల సలహాలు పాటించమని సూచించిన సీఎం
పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పవన్ కు సూచించారు. వైద్యులు చెప్పిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్యం కుదుటపడే వరకు పనిభారం తగ్గించుకోవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పరిపాలనకు సంబంధించిన అంశాలనూ ప్రస్తావించారు. శస్త్ర చికిత్స అనంతరం కూడా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించడం, ఫైళ్లను పరిశీలించడం వంటి పనులు చేస్తున్నారని తెలిసి, వాటిని నిర్దేశిత సమయాల్లోనే పరిమితం చేయాలని సూచించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే సాధారణ విధుల్లోకి రావాలని చెప్పారు.
ఈ భేటీతో వీడిన స్పష్టత
ఈ సమాచారంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అనుమానాలకు స్పష్టత వచ్చింది. సైనస్ సమస్య చిన్నది కాదని, అది ఇన్ఫెక్షన్‌గా మారి కంటి వరకు ప్రభావం చూపే స్థాయికి వెళ్లిందని తెలిసింది. అలాగే పాత గాయాలు కూడా ఇప్పుడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని వెల్లడైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సూచించినట్లుగా పూర్తి విశ్రాంతి తీసుకుంటే త్వరలోనే ఆయన మళ్లీ చురుకైన కార్యకలాపాల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి, ఊహాగానాల మధ్య కొనసాగుతున్న ఈ ఆరోగ్య అంశంపై పవన్ కళ్యాణ్ స్వయంగా ఇచ్చిన వివరాలు స్పష్టత తీసుకువచ్చాయి. సాధారణంగా కనిపించిన సమస్య ఎలా శస్త్ర చికిత్స వరకు వెళ్లిందో, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో సీఎం, డీసీఎం భేటీ ద్వారా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..