
ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ గురిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో పలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజ్. ఇక తెలుగు ప్రేక్షకులకు కట్టప్ప పాత్ర ద్వారా మరింత దగ్గరయ్యాడు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్, ఆ పాత్రలో ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు స్టార్ నటుడిగా రాణిస్తున్న సత్యరాజ్ అంత ఈజీగా ఈ పొజిషన్ కు రాలేదు. ఆయన సినీ ప్రస్థానం ఎన్నో మలుపులతో కూడుకున్నది. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో విలన్ పాత్రలు పోషించిన ఆయన, ఆ తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళ, తెలుగు చిత్రాలలో తనదైన ముద్ర వేస్తున్నారు.
సత్యరాజ్ అసలు పేరు రంగరాజు. హిందీ నటుడు రాజేష్ ఖన్నా అంటే ఆయనకు అమితమైన అభిమానం. ఆయన స్ఫూర్తితోనే ఎలాగైనా వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ రగిలింది. అయితే, నటుడిగా మారాలనే ఆయన కోరికకు తల్లిదండ్రులు సుముఖంగా లేరు. అయినప్పటికీ, వారి అభ్యంతరాలను లెక్కచేయకుండా, సినిమాలపై ఉన్న పట్టుదలతో చెన్నైకి పయనమయ్యారు. చెన్నైకి వచ్చిన తర్వాత, నటుడు సూర్య తండ్రి, అప్పటి తమిళ టాప్ హీరో శివకుమార్‌ను కలిసి తనకు సినిమా అవకాశం ఇప్పించాలని ఎంతో వేడుకున్నారట సత్యరాజ్. అయితే, తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేయడం సరికాదని, చదువు పూర్తి చేయమని సలహా ఇచ్చి శివకుమార్ ఆయనను పంపించేశారట. కానీ సత్యరాజ్ పట్టు వదలకుండా చెన్నైలోనే ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అలా కమల్ హాసన్ హీరోగా నటించిన సట్టమ్ ఎన్ కైయిల్ చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో, ప్రధాన విలన్ అనుచరుడిగా కనిపించారు. ఆ తర్వాత 1985లో కార్తీక్ రఘునాథ్ రూపొందించిన సావి చిత్రంలో తొలిసారిగా హీరోగా నటించి, తన నటనా ప్రస్థానంలో మరో అడుగు వేశారు. సత్యరాజ్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డు, ఎం.జి.ఆర్ అవార్డు, పెరియార్ అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా, ఫిలింఫేర్ అవార్డులు, విజయ్ అవార్డులు కూడా ఆయనను వరించాయి. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర ఆయనను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.