
మూవీ రివ్యూ: శుభం
నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు
సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి: మృదుల్ సేన్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
నిర్మాత: సమంత రూత్ ప్రభు
ఇన్నాళ్లు యాక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
వైజాగ్ లోని భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ శ్రీను (హర్షిత్ రెడ్డి), తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) సంతోషంగా జీవితం గడుపుతుంటారు. అందులో శీను మాత్రమే బ్యాచిలర్. మిగిలిన ఇద్దరికీ పెళ్లి అవుతుంది. వాళ్ల భార్యలు ఫరీదా, గాయత్రి (శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి). అదే సమయంలో శ్రీవల్లి (శ్రియా కొంతం)తో శీను పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ తో లోపలికి వచ్చిన శ్రీవల్లి.. సీరియల్ టైం అవ్వగానే వెళ్లి టీవీ ముందుకు కూర్చుంటుంది. అదేంటని శీను అడగ్గానే దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఇదే విషయం తన స్నేహితులకు చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది అని వాళ్ళు కూడా చెప్తారు. కేవలం తమ ముగ్గురు ఇళ్లలో కాదు మొత్తం ఊర్లో ఆ సీరియల్ చూస్తున్న సమయంలో ఆడవాళ్లకు దయ్యం పట్టినట్టు నానా హంగామా చేస్తుంటారు. దాంతో పరిష్కారం కోసం అదే ఊర్లో ఉన్న మాత మాయ ( సమంత రుత్ ప్రభు)ను సలహా కోసం ఆశ్రయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
ఆడవాళ్లకు సీరియల్స్ కు విడదీయడానికి అనుబంధం ఉంటుంది. సంవత్సరాలు పాటు ఆ సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళు. సరిగ్గా తన తొలి సినిమా కోసం అలాంటి కథను ఎంచుకుంది సమంత. సీరియల్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వచ్చేసాడు దర్శకుడు ప్రవీణ్. తొలి 15 నిమిషాల్లోనే హీరో పెళ్లి అయిపోతుంది. ఫస్ట్ నైట్ రోజు నుంచే కథలో వేగం పెంచేసాడు. హీరోయిన్ సీరియల్ చూస్తూ కూర్చోవడం.. వెంటనే దయ్యం పట్టడం.. ఆ తర్వాత వాళ్ళ స్నేహితుల ఇళ్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం.. ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సీరియల్ లోని సన్నివేశాలు చూపిస్తూ బాగా నవ్వించాడు దర్శకుడు ప్రవీణ్. కథ అక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం సీరియల్స్ చూడడం.. సమయంలో వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే దయ్యం పట్టినట్టు వాళ్ళని కొట్టడం చేస్తుంటారు. అందులోనే కావాల్సినంత ఫన్ జనరేట్ చేసాడు దర్శకుడు.
ఇంటర్వెల్ కు ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేశాడు. అయితే సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటి తర్వాత కథ బాగా నెమ్మదిస్తుంది. సినిమాలో చూపించే సీరియల్ మాదిరే అక్కడక్కడే తిరుగుతుంది. నీరసం వచ్చేస్తుంది అనే టైంకి తన తొలి సినిమా అయిన సినిమా బండి యూనిట్ ను తీసుకొచ్చి ఈ కథకు తగ్గట్టు వాడుకున్నాడు దర్శకుడు ప్రవీణ్. అక్కడినుంచి మళ్ళీ కథలో వేగం పెరిగింది. ఆడవాళ్లను గౌరవించాలి.. ముఖ్యంగా భార్యల ప్రేమను అర్థం చేసుకోవాలి.. వాళ్లను అన్ని విధాల గౌరవించాలి.. వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవాలి.. మేల్ డామినేటెడ్ గా ఉండకూడదు.. ఇలా సినిమాలో చాలా సందేశం ఇచ్చారు. క్లైమాక్స్ కూడా ఊహించదగ్గదే అయినా కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకటి రెండు మెయిన్ ట్విస్టులు ఉన్నాయి.. అవి రివీల్ చేస్తే సినిమా కథ కూడా రివిల్ అవుతుంది కాబట్టి అవి ఇక్కడ చెప్పడం లేదు సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
నటీనటులు:
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే కనిపిస్తారు. మెయిన్ హీరోగా నటించిన హర్షిత్ రెడ్డి బాగున్నాడు.. అలాగే హీరోయిన్ శ్రియ కొంతం కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మిగిలిన ఇద్దరు స్నేహితులు శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి కూడా బాగా చేశారు. వాళ్ల భార్యలుగా నటించిన శాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మి నటన చాలా బాగుంది. మరో ఇంపార్టెంట్ పాత్రలో వంశీధర్ అద్భుతంగా నవ్వించాడు. మిగిలిన పాత్రను తమ తమ పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీం:
క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కూడా పర్లేదు. ఎడిటింగ్ వంక పెట్టడానికి ఏం లేదు. సినిమా కేవలం రెండు గంటలే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్ కండ్రెగుల మరోసారి బాగానే మెప్పించాడు. ఈసారి సీరియల్స్ ను టార్గెట్ చేసి తన కథ రాసుకున్నాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆడవాళ్లను గౌరవించాలి.. వాళ్లని తక్కువగా చూడకూడదని మెసేజ్ ఇచ్చాడు.. కాస్త ప్రమోట్ చేసుకుంటే థియేటర్ వరకు ప్రేక్షకులను తీసుకొచ్చే సినిమా ఇది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా శుభం.. అంతా శుభమే.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..