అభిమాని హత్యకేసులో ప్రముఖ కన్నడ హీరో, అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ గత కొన్ని రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు.రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1 నిందితురాలిగా ఉండగా, దర్శన్ ఏ2గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న నటి పవిత్ర గౌడ ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం (జూన్ 18)
ఓ వైద్యుడిని పోలీస్ స్టేషన్ కు రప్పించి నటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆరోగ్యం బాగా క్షీణించడంతో పవిత్రగౌడ్‌ను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. పవిత్ర గౌడ ఆరోగ్యంలో ఎలాంటి సమస్య వచ్చిందో డాక్టర్లు వివరించారు. ‘పవిత్ర ఉదయం నుంచి భోజనం చేయలేదు. అందువల్ల, గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంది. మేము IV ద్రవాన్ని అందించాం. అలాగే కొద్దిగా గ్యాస్ట్రిటిస్ వచ్చింది. బీపీ కాస్త తగ్గింది. ఇంతకు మించి ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలేమీ లేవు. మిగతా నిందితులంతా ఆరోగ్యంగా ఉన్నారు’ అని డాక్టర్లు నివేదిక సమర్పించారు.
కాగా పవిత్ర గౌడకు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపారు. దీంతో దర్శన్, అతని సహచరులు రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి గుణపాఠం చెప్పేందుకు బెంగళూరుకు తీసుకొచ్చి హత్య చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో హీరో దర్శన్ ఏ2 ఉన్నాడు . ప్రధాన నిందితులంతా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నేరస్తులను శిక్షించాలని, రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అదే సమయంలో హీరో దర్శన్ కు అనుకూలంగా కూడా ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కాగా దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్‌గా పనిచేసిన శ్రీధర్ ఏప్రిల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆత్మహత్య కేసును మళ్లీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1గా ఉన్నారు. దర్శన్ ఏ2గా, కె.పవన్ ఏ3గా ఉన్నారు. రాఘవేంద్ర ఏ4, నందీష్ ఏ5, జగదీష్ అలియాస్ జగ్గా ఏ6, అను ఏ7, రవి ఏ8, రాజు ఏ9, వినయ్ ఏ10, నాగరాజ్ ఏ11, లక్ష్మణ్ ఏ12, దీపక్ ఏ13, ప్రదోష్ ఏ14, కార్తీక్ ఏ15, కేశవమూర్తి ఏ16, నిఖిల్ నాయక్ ఏ17గా నమోదయ్యారు. ప్రస్తుతం వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.