తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా ప్రత్యేకం. విభిన్న కథలను తెరకెక్కించడమే కాకుండా తన సినిమాల్లోని పాత్రలను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దడంలో ఆయనకు సాటి మరెవరు లేరు. అడియన్స్ మనసుకు ప్రశాంతతను కలిగించే కథలను వెండితెరపై ఎంతో అందంగా రూపొందిస్తారు. అందుకే యువతకు శేఖర్ కమ్ముల సినిమాలంటే తెలియని ఆసక్తి ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల జరుగుతున్న కథలనే తెరపైకి తీసుకువచ్చారా అన్నట్లుగా తెరకెక్కిస్తారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అందమైన సినిమాలలో గోదావరి ఒకటి. వేసవిలో జనాల మనసులకు చల్లగా ఉంటుంది అంటూ గోదావరి సినిమాను విడుదల చేశారు. 2006 మే 19న గోదావరి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై నేటికి 18 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందామా.
ఆనంద్.. ఓ మంచి కాఫీ లాంటి అబ్బాయి సినిమాను చిత్రీకరిస్తున్న సమయంలోనే గోదావరి కథను రాసుకున్నారు శేఖర్ కమ్ముల. గోదావరిని ఇతివృత్తంగా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట. ఇక వెంటనే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. తన మనసులోని మాటను ఆనంద్ హీరోయిన్ కమలినీ ముఖర్జీకి చెప్పగా.. ఆ సినిమా కథకు.. పాత్రకు కమలిని ఫిదా అయ్యారు. వెంటనే ఈసినిమాలో కథానాయికగా నటిస్తానని చెప్పడంతో ఆలోచిద్దామని అన్నారట. ఆనంద్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత గోదావరి సినిమా చిత్రీకరణ కోసం పనులు మొదలుపెట్టారట శేఖర్ కమ్ముల.
ముందుగా ఈ సినిమాకు కథను సిద్ధం చేసి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ వీరిలో ఎవరో ఒకరితో సినిమాను తెరకెక్కించాలనుకున్నారట. కానీ ఆ సమయంలో అందరూ బిజీగా ఉండడంతో ఈ మూవీ సుమంత్ వద్దకు చేరింది. ఇక హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఆనంద్ హీరోయిన్ ఈ కథకు సెట్ అవుతుందని చెప్పడంతో కథానాయికగా కమలినీ ఫిక్స్ అయ్యింది. ఇందులో రామ్, సీత పాత్రలలో సుమంత్, కమలినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సీత పాత్రను శేఖర్ కమ్ముల డిజైన్ చేసిన తీరు యువతను కట్టిపడేసింది. ఇందులోని కోటిగాడు (కుక్క)కు శేఖర్ కమ్ముల వాయిస్ ఓవర్ అందించారట. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది గోదావరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.