డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈమూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బన్నీ.. పుష్ప తర్వాత నార్త్ అడియన్స్ ఫేవరేట్ హీరో అయ్యాడు. ఇక ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ పాత్రతోపాటు మరో రోల్ కూడా హైలెట్ అయ్యింది. అదే కేశవ పాత్ర. పుష్పరాజ్ కు ప్రాణ స్నేహితుడు. ఇందులో కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. ఈ సినిమాతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ను అనుకున్నామని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. నిన్న నిర్వహించిన ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుకుమార్.
యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రసన్న వదనం. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై.కె దర్శకత్వం వహించారు. మే 3న ఈ సినిమా విడుదలవుతుండడంతో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబుతోపాటు.. సుకుమార్ సతీమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. జగడం సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ అర్జున్ కలిశాడని.. ఆర్య సినిమా నచ్చి నా వద్ద పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పాడని.. దీంతో అతడిని తన టీంలో జాయిన్ చేసుకున్నట్లు తెలిపాడు.
“సుహాస్.. నువ్వంటే నాకు, అల్లు అర్జున్‌కు చాలా ఇష్టం. నీ ఎదుగుదల చూస్తున్నాం. పుష్ప సినిమాలోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవగా ముందు నిన్నే అనుకున్నాం. కానీ అప్పటికే హీరోగా చేస్తున్న నిన్ను ఆ పాత్రకు ఎంపిక చేయడం బాగోదనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్ ఫ్యూచర్ నానిలా కనిపిస్తున్నాడు. సహజ నటుడు నాని కాబట్టి సుహాస్ ను మట్టి నటుడు అనాలేమో. అంతగా ఆయన పాత్రల్లో ఒదిగిపోతాడు. ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారు”అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.