ఇస్లామిక్ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్ యూనివర్స్ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది. దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ దేశానికి రూమీ అల్కహ్తాని (27) అనే మోడల్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ విషయాన్ని ఈ అందాల భామ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సోమవారం (మార్చి 26) స్వయంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మిస్ యూనివర్స్ పోటీలకు తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు రూమీ అల్కహ్తాని తన గ్లామరస్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో రూమీ స్ట్రాప్‌లెస్ సీక్విన్డ్ ఫ్రాక్ ధరించి కనిపించింది. ‘మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొనడం నాకు గౌరవంగా ఉంది. మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా మొదటిసారి పాల్గొంటోంది’అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అరబిక్‌లో రాసింది. దీంతో అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా రూమీ అల్కహ్తాని చరిత్ర సృష్టించనుంది.
కాగా 73వ మిస్ యూనివర్స్ పోటీలు ఈ ఏడాది సెప్టెంబర్ 28 మెక్సికో వేధికగా నిర్వహించనున్నారు. ఇందులో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొంటోంది. రియాద్‌లో పుట్టి పెరిగిన రూమీ మిస్ యూనివర్స్ పోటీల్లో అధికారికంగా పాల్గొననుంది. అందాల పోటీల్లో పొల్గొనడం రూమీకి ఇదేం తొలిసారి కాదు. కొన్ని వారాల క్రితం మలేసియాలో నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏసియన్ పోటీలోనూ ఆమె పాల్గొంది. సౌదీ అందాల తారలు అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొననప్పటికీ ఆ దేశంలో స్థానికంగా నిర్వహించే బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంటారు. అలా నిర్వహించిన స్థానిక అందాల పోటీల్లో రూమీ మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకుంది. అలాగే మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ వుమెన్ సౌదీ అరేబియా టైటిళ్లను కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రపంచ వేదికపై మెరిసేందుకు సిద్ధమైంది.
View this post on Instagram
కాగా గతేడాది మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని నికరాగ్వాకు చెందిన మిస్ షెన్నిస్ పలాసియోస్ దక్కించుకుంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, ఆస్ట్రేలియాకు చెందిన మొరయా విల్సన్ నిలిచారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.