Most Recent

పండక్కి ‘నా సామిరంగ’.. సంక్రాంతి‌కి కింగ్ నాగార్జున హిట్ కొట్టాడా.! సినిమా ఎలా ఉందంటే?

పండక్కి ‘నా సామిరంగ’.. సంక్రాంతి‌కి కింగ్ నాగార్జున హిట్ కొట్టాడా.! సినిమా ఎలా ఉందంటే?

మూవీ రివ్యూ: నా సామిరంగ

నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అశికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్, నాజర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

సంగీతం: ఎంఎం కీరవాణి

ఎడిటర్: చోటా కే ప్రసాద్

కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ బిన్నీ

సంక్రాంతికి పండగ లాంటి సినిమాతో వచ్చి హిట్టు కొట్టడం ఈ మధ్య అలవాటుగా చేసుకున్నాడు నాగార్జున. మరి ఇప్పుడు వచ్చిన నా సామిరంగ కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేసిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లి పిల్లలు కాకపోయినా ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. భాస్కర్ (రాజ్ తరుణ్) అదే ఊర్లో ఉంటాడు. పక్క ఊరి ప్రెసిడెంట్ కూతుర్ని(రుక్సర్) ప్రేమిస్తుంటాడు. వాళ్ళ ఇంటి గోడ దూకినందుకు భాస్కర్‌ను చంపడానికి పక్క ఊరు వాళ్ళు వస్తారు. అతన్ని కాపాడే బాధ్యత ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య(నాజర్) కిష్టయ్యకు అప్పచెప్తాడు. ఇక కిష్టయ్య అదే ఊర్లో ఉండే వరాలు(ఆశిక రంగనాథ్)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. కానీ ఒక కారణంతో వాళ్లు దూరంగా ఉంటారు. ఇంతలో భాస్కర్ గొడవ పెద్దదవుతుంది. ఊరు మీదికి వస్తుంది. ఆ గొడవల్లో కిష్టయ్య, అంజిని ఎలాగైనా చంపేయాలని పెద్దయ్య కొడుకు దాస్(షబ్బీర్ కళారక్కల్) అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తర్వాత ఏమైంది.. వరాలు, కిష్టయ్య ఎందుకు దూరంగా ఉంటారు.. వాళ్లు కలిసారా లేదా అనేది అసలు కథ..

కథనం:

కొందరు హీరోలకు కొన్ని పండగలు కలిసొస్తాయి.. అలా సంక్రాంతి నాగార్జునకు రాసి పెట్టుంది. నా సామిరంగ సూపర్ సినిమా ఏం కాదు. ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ కథ. కానీ తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా ఉంది. పండక్కి కుటుంబంతో పాటు చూసేలా అనిపించే కలర్ ఫుల్ సినిమా. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు జరిగే కథ మనకు ముందే తెలుస్తుంది. అయినా కూడా ఎంగేజ్ అయ్యేలా తీసాడు దర్శకుడు విజయ్ బిన్నీ. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మొదటి హీరో.. అయితే రెండో హీరో అల్లరి నరేష్. నాగార్జున, నరేష్ మధ్య వచ్చే సీన్స్ అన్ని బాగున్నాయి. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషన్స్ పై ఫోకస్ చేశాడు దర్శకుడు. అవి చాలా వరకు కనెక్ట్ అవడం సినిమాకు కలిసి వచ్చే విషయం. ఎంటర్టైన్మెంట్ పోర్షన్ మొత్తం నరేష్ చూసుకున్నాడు. నవ్వించాడు ఏడిపించాడు కూడా..! నాగార్జున, ఆషిక రంగనాథ్ ప్రేమ కథే ఈ సినిమా అంతా. అయితే నాగార్జున పక్కన హీరోయిన్ అంతగా బాగోలేదు. అది నాగ్ ఏజ్ సమస్య కావచ్చు. మరీ చిన్న పిల్లలా అనిపించింది. కానీ వాళ్ళ మధ్య స్టోరీ మాత్రం బాగుంది. నరేష్ సీక్వెన్స్ అంతా బాగా రాసుకున్నాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ అయితే కన్నీళ్లు పెట్టించేసాడు అల్లరి నరేష్. సినిమా కథ మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లోనే అయిపోతుంది. ఈ మూడు రోజుల కథను తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు విజయ్.

నటీనటులు:

నాగార్జున ఎనర్జీ అదిరిపోయింది.. యాక్షన్ పార్ట్ మాత్రం ఇరగదీసాడు. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ లో శివ చైన్ రిఫరెన్స్ కు విజిల్స్ పక్కా. నాగార్జున తర్వాత అల్లరి నరేష్ ఈ సినిమాకు ప్రాణం పోసాడు. ఆయన పోషించిన అంజి గాడి పాత్ర చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఆశిక రంగనాథ్, మిర్నా పాత్రలు ఓకే. రాజ్ తరుణ్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. ఇక మెయిన్ విలన్‌గా షబ్బీర్ బాగున్నాడు. రావు రమేష్, నాజర్ లాంటి వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు కనపడని మరో హీరో కీరవాణి.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ను ఎలివేట్ చేసింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడా పెద్దగా బోర్ కొట్టే సన్నివేశాలు లేవు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథ, మాటలు బాగున్నాయి. కొత్త వాడే అయినా విజయ్ బిన్ని సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ‘నా సామిరంగ’.. అంచనాలు లేకుండా వెళ్తే పండక్కి పాస్ మార్కులు వేయించుకునే సినిమా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.