-
అయితే ఈ రోజుల్లో సినిమాల్లో పాటలు వినేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు.. అందుకే ఆర్ఆర్తో ఆడియన్స్‌ను కట్టి పడేయాలి. పాపం అంతకంటే మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది సంగీత దర్శకులకు. ఈ జాబ్ చేయడంలో చాలా తక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అందులోనూ కొందరైతే అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమా రేంజ్ పెంచేస్తున్నారు. ఈ లిస్టులో అనిరుధ్, దేవీ శ్రీ ప్రసాద్, థమన్, అజినీష్ లోక్‌నాథ్ లాంటి సంగీత దర్శకులు ముందు వరసలో ఉంటారు.
-
మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య చాలా సినిమాలకు తన మ్యూజిక్‌తోనే ప్రాణం పోసాడు అనిరుధ్. జవాన్, జైలర్, లియో లాంటి సినిమాలు అంత పెద్ద విజయం సాధించడానికి కారణం మరో అనుమానం లేకుండా అనిరుధ్ సంగీతమే. రజినీకాంత్ సైతం దీన్ని ఒప్పుకున్నాడు. తనకు జైలర్ ఆర్ఆర్ లేకుండా చూస్తే యావరేజ్ అనిపించిందని.. అదే సినిమాను అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్క్రోర్తో చూసాక బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోయినట్లు చెప్పాడు సూపర్ స్టార్. దీన్నిబట్టి మ్యూజిక్ పవర్ అర్థమవుతుంది.
-
అలాగే థమన్ కూడా వీరసింహారెడ్డి, అఖండ.. ఈ మధ్యే భగవంత్ కేసరి లాంటి సినిమాలకు అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చాడు థమన్. వాటి విజయాలకు థమన్ సంగీతం కూడా ప్రధానమైన కారణం. తాజాగా అజినీష్ లోక్‌నాథ్ సైతం అదిరిపోయే మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసాడు.
-
గతేడాది కాంతారా సినిమాకు ఈయన అందించిన సంగీతం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. అలాగే విరూపాక్షకు కూడా అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చాడీయన. తాజాగా మంగళవారం సినిమాకు ప్రాణంగా నిలిచాడు అజినీష్. కథనం రొటీన్‌గానే ఉన్నా.. అజినీష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో స్థాయిలో ఉంది. సినిమాకు ఈ రేంజ్ టాక్ రావడానికి మెయిన్ రీజన్ రీ రికార్డింగ్.
-
కొన్ని సీన్స్ అయితే కేవలం మ్యూజిక్ వల్లే హైలైట్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. సినిమాకు ఆర్ఆర్ ఎంత కీలకం అనేది గతంలోనే చాలా సినిమాలు నిరూపించాయి. తాజాగా మంగళవారం కూడా దీనికి నిదర్శనంగా నిలిచింది. కచ్చితంగా ఈ సినిమా తర్వాత తెలుగులో అజినీష్ కోసం క్యూ కట్టడం ఖాయం. మొత్తానికి దర్శకుల కథలు.. హీరోల క్రేజ్ మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ఆర్ కూడా సినిమాలను నిలబెడుతున్నాయి.