బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గత కొన్ని నెలలుగా మాస్క్ తోనే కనిపిస్తున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ముఖానికి ఏదో ఒక మాస్క్ పెట్టుకునే తిరుగుతున్నాడు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అశ్లీల సినిమాలు తీశాడనే ఆరోపణలతో జైలు శిక్షను అనుభవించాడు రాజ్ కుంద్రా. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా మాస్క్ ధరించే బయట తిరుగుతున్నాడు. మీడియా కెమెరాల నుంచి తప్పించుకోవడానికే అతను ఇలా ముసుగు ధరించి తిరుగుతున్నాడు. అతనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే ఇప్పుడు రెండేళ్ల తర్వాత రాజ్ కుంద్రా తన ముసుగును తొలగించాడు. అందరికీ తన ముఖాన్ని చూపించాడు. అయితే దీనికి ఒక ప్రత్యేక కారణముంది. రాజ్ కుంద్రా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా ఓ సినిమాను నిర్మించారు. అసభ్యకర సినిమాలు, వీడియోలు తీసిన కేసులో జైలుకెళ్లిన రాజ్ కుంద్రా.. తాను జైలులో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ‘యూటీ 69’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు (అక్టోబర్ 18) విడుదల కాగా, ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజ్ కుంద్రా మీడియాకు తన ముఖాన్ని చూపించారు. ఇక ముసుగు ధరించి తిరగడంపై రాజ్ కుంద్రా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు ‘ నాపై చేసిన ఆరోపణలకు నన్ను కోర్టులో విచారిస్తున్నారు, అది నన్ను పెద్దగా బాధించలేదు, కానీ నాపై ‘మీడియా విచారణ’ ఎంతో బాధ కలిగించింది. నాపై ఉన్నవి, లేనివి ప్రతిరోజూ టెలికాస్ట్ చేశారు. ఇది నన్ను చాలా బాధించింది. అందుకే మీడియాకు దూరంగా ఉండేందుకు మాస్క్ ధరించడం మొదలుపెట్టాను. అలాగనీ నేను మీడియాను నిందించడంలేదు. అది తన పని తాను చేసుకుపోతోంది’ అని రాజ్ కుంద్రా వెల్లడించాడు.
‘UT 69’ సినిమాలో రాజ్ కుంద్రానే ప్రధాన పాత్ర పోషించాడు. సుమారు నెల రోజుల పాటు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా అక్కడ ఎదుర్కొన్న సమస్యల ఆధారంగానే ఈ సినిమా తీశారు. ఈ చిత్రానికి షానవాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుంద్రా స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. రాజ్ కుంద్రా కఠినమైన జైలు జీవితానికి కాస్త కామెడీ టచ్‌ను ఇచ్చి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా సినిమా జైళ్లు, అక్కడి గందరగోళం, ఖైదీల కష్టాలు, వారి కష్టాలు, నష్టాలను యూటీ 69 లో చూపించారు. అలాగే రాజ్ కుంద్రాపై వచ్చిన ఆరోపణలను కూడా ప్రస్తావించనున్నారు. కాగా జైలు నుంచి ఇటీవలే ప్రజా జీవితంలోకి తిరిగి వచ్చిన రాజ్ కుంద్రా ఇటీవల స్టాండప్ కామెడీ కూడా చేశాడు. అది కూడా ముసుగు ధరించి చేశాడు. కాగా రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు జూలై 2021 నెలలో అశ్లీల వీడియోలు తీయడం, అమ్మం కేసులో కేసులో అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా భారత్‌లో అసభ్యకర వీడియోలు రూపొందించి విదేశాల్లో ఉన్న తన సొంత వెబ్ సైట్లకు అప్‌లోడ్ చేస్తూ ప్రతిరోజూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడని ముంబై పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా, అతను ఆర్థర్ రోడ్ జైలులో సుమారు రెండు నెలల పాటు ఉన్నాడు. అనంతరం గతేడాది సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు.
యూటీ 69 ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.