
బ్రో సినిమా రాజకీయ మంటలు రాజేస్తోంది. సినిమాపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ కాకపుట్టిస్తున్నాయ్. సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలు కూడా చెబుతున్న అంబటి.. బ్రో అట్టర్ ప్లాప్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, రాజకీయ ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. బ్రో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందన్నారు. ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో..చెప్పాల్సిన అవసరం లేదన్న విశ్వ ప్రసాద్ ఏజెన్సీలకు సమాధానమిస్తామన్నారు.
ఏపీలో పవన్ బ్రో సినిమా వెనక పెద్ద స్కామ్ ఉందంటూ.. మంత్రి అంబటి రాంబాబు రేపిన రాజకీయ తుఫాన్ కంటిన్యూ అవుతోంది. దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందేనని ఆ పార్టీ నేత రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అయితే మంత్రి అంబటి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు బ్రో మూవీ నిర్మాత టీజీ. విశ్వప్రసాద్. ట్యాక్సులకు సంబంధించి డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయన్నారు. ఇవన్నీ ఊహాజనితమేనని కొట్టిపారేశారాయన.
నిర్మాత టీజీ. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. బ్రో సినిమా బ్లాక్ బస్టర్. పవన్‌కి ఎంత ఇచ్చామో ఎవరికీ చెప్పాల్సిన అవసరంలేదు. సినిమాకు ఎంత ఖర్చు చేశామో చెప్పాల్సిన పనిలేదు అన్నారు. అలాగే ఏజెన్సీలు వస్తే లెక్కలు చూపిస్తాం. వ్యక్తులకు లెక్కలు చెప్పాల్సిన పనిలేదు అని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు.