2018.. గత నెల రోజులుగా సినిమా ఇండస్ట్రీలో మార్మోగుతున్న మలయాళ మూవీ. 2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ మూవీని తెరకెక్కించారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటోన్న టొవినో థామస్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అపర్ణా బాల మురళి, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషించారు. మే 5న చిన్న సినిమాగా విడుదలైన 2018 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దెబ్బకు మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే జీఏ2 పిక్చర్స్ బ్యానర్ అధినేత బన్నీ వాస్ మే 26న 2018 సినిమాను తెలుగులో విడుదల చేశారు. తొలిరోజే కోటికి పైగా కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో స్టడీగానే కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఇంతలోనే 2018 ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో (బుధవారం) జూన్ 7వ తేదీ నుంచే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయితే ఇంతలోనే కేరళలోని థియేటర్ల యజమానులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 2018 సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ్యతిరేకంగా 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో 2018 ఓటీటీ రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడవన్నీ పటాపంచాలయ్యాయి. బుధవారం స్ట్రీమింగ్ కావాల్సిన 2018 సినిమా మంగళవారం (జూన్ 6) సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో 2018 సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Witness the incredible talent of the actors and get lost in a narrative that will keep you on the edge of your seat #2018, the biggest Malayalam blockbuster is now streaming in Hindi. #2018movie #2018OnSonyLIV #SonyLIV #BiggestBlockbuster
@ttovino #JudeAnthanyJoseph pic.twitter.com/klfI4oN226
— Sony LIV (@SonyLIV) June 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.