Most Recent

Adipurush: తనలోని రాముడిని ప్రభాస్‌ పైకి తీసుకొస్తున్నాడు.. ఇంతకంటే మహోపకారం ఉండదు: చినజీయర్‌ స్వామి

Adipurush: తనలోని రాముడిని ప్రభాస్‌ పైకి తీసుకొస్తున్నాడు.. ఇంతకంటే మహోపకారం ఉండదు: చినజీయర్‌ స్వామి
Adipurush Pre Release Event

బాహుబలి ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్‌ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. తమ అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం కూడా తరలి రావడంతో తిరుపతి గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్‌, జై సియారామ్‌ నినాదాలూ హోరెత్తాయి. బ్రహ్మాండమైన సినిమాకు సంబంధించి ఈ ప్రి రిలీజ్‌ వేడుక.. బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత జరగడం విశేషం. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సినిమా టీమ్‌. హీరో ప్రభాస్‌తో పాటు సినిమా టీమ్‌ మెంబర్స్‌ అంతా.. ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన గ్రాండ్‌ ఈవెంట్‌కు వచ్చారు. ఈ వేడుకకు హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ కృతిసనన్‌లతో పాటు సినిమా టీమ్‌ మొత్తం విచ్చేసింది.  త్రిదండి చినజీయర్‌ స్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ప్రభాస్‌ ఎంట్రీ సమయంలో.. బాణాసంచి పేలుళ్లతో గ్రౌండ్‌ అంతా సందడిగా మారింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకలో ప్రత్యేక కార్యక్రమాలు అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాకు ప్రాణంలా అనిపించే.. జై శ్రీరామ్‌ పాటను లైవ్‌లో ఆలపించింది అజయ్ అతుల్‌ అండ్‌ టీమ్‌. వారితో పాటు అశేష జనవాహిని సైతం.. గొంతు కలపడం విశేషం.కరెక్టుగా తొమ్మిందింటికి సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ట్రైలర్‌ను… హిందీ, తెలుగు సహా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయడం విశేషం.

ఈ సందర్భంగా మాట్లాడిన చినజీయర్‌ స్వామి మన అందరిలోనూ రాముడు ఉన్నారన్నారు. వారిని తట్టి లేపేందుకే.. ప్రభాస్‌ ఈ సినిమా తీశారని అభినందించారు. ప్రతి ఒక్కరూ తమలోనూ రాముణ్ని గుర్తించాలన్నారు.’ ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. అలాంటి వ్యక్తికి ఈ సమాజం ఆలయాలు కట్టి కొలుస్తుంది. ఈ విషయాన్నే రామాయణం నిరూపించింది. మన అందరిలోనూ రాముడు ఉన్నారు. వారిని తట్టి లేపేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్‌ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్‌కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’ అని చిన్నజీయర్‌ స్వామి తెలిపారు. ఈ వేడుకకు మరో అతిథిగా హజరయ్యారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్‌.. ఆదిపురుష్‌తో ఆ స్థాయిని మరింత పెంచారని ప్రశంసించారు. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత విశ్వ ప్రసాద్‌. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది అందరి సినిమా అన్నారు దర్శకుడు ఓం రౌత్‌. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి, సినిమాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.