

సహజ నటుడు శరత్ బాబు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యం కారణంగా శరత్ బాబు కన్నుమూశారు. హీరోయిన్లకు సోదరుడిగా, మధ్యతరగతి మనిషిగా, ప్రలోభాలకు గురైన వ్యక్తిగా, హీరోకి స్నేహితుడిగా, ప్రతినాయకుడిగా, సిట్చువేషన్స్ కి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించారు శరత్‌బాబు. బాలచందర్, కె.విశ్వనాథ్, రజనీకాంత్, చిరంజీవి సినిమాల్లో శరత్‌బాబు పాత్రలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. సోషల్ సినిమాలు మాత్రమే కాదు పౌరాణిక, జానపద, భక్తి చిత్రాలతోనూ మెప్పించారు శరత్‌బాబు.
గంభీరమైన స్వరంతో ఆయన చెప్పే డైలాగులకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. తెలుగు, తమిళంలో ఆయన డైలాగులు చెప్పే తీరు తనకు చాలా ఇష్టమని కె.విశ్వనాథ్ పలు సందర్భాల్లో చెప్పారు. తెలుగులో సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నందులు అందుకున్నారు. తమిళనాడు, కేరళ స్టేట్ అవార్డులు కూడా అందుకున్న ఘనత ఆయనది. సిల్వర్‌స్క్రీన్ మీద వెలుగుతూ టీవీల్లో నటించిన నటుల్లో శరత్‌బాబుది ప్రత్యేకమైన స్థానం. తమిళ దూరదర్శన్‌లో వచ్చే పలు ధారావాహికల్లో నటించారు. తెలుగులోనూ పలు సీరియళ్లలో నటించారు.
కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే రమాప్రభను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. అప్పటికే రమాప్రభ హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నంబియార్ కుమార్తె స్నేహను పెళ్లాడారు. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ఇదిలా ఉంటే శరత్ బాబు చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారని తెలుస్తోంది. నటుడిగా ఆయన ఎన్నో ఆస్తులను సంపాదించారు. అయితేఆయనకు ఎంతో ఇష్టమైన హార్సిలీ హిల్స్ లో ఒక అందమైన ఇంటిని నిర్మించి అక్కడ స్థిరపడాలన్నదే తన కోరిక. అయితే ప్రస్తుతం అక్కడ ఇంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ కోరిక తీరకుండానే శరత్ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.