Most Recent

Madhavan: గోల్డెన్‌ ఫిష్‌.. స్విమ్మింగ్‌లో మాధవన్‌ కుమారుడి సత్తా.. ఈసారి ఏకంగా 5 బంగారు పతకాలు కైవసం

Madhavan: గోల్డెన్‌ ఫిష్‌.. స్విమ్మింగ్‌లో మాధవన్‌ కుమారుడి సత్తా.. ఈసారి ఏకంగా 5 బంగారు పతకాలు కైవసం
Madhavan Son

‘రాజు కొడుకు రాజే అవుతాడు’ అంటూ సాధారణంగా సినిమా సెలబ్రిటీల కుమారులు హీరోలుగానే స్థిరపడతారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్టార్‌ కిడ్స్‌గా చెలామణి అవుతుంటారు. అయితే కొందరు మాత్రం భిన్న రంగాలను ఎంచుకుంటారు. తల్లిదండ్రులు ఏ రంగంలో ఉన్నారని పట్టించుకోకుండా.. తమకు ఇష్టమైన రంగంలో దూసుకెళతారు. సరిగ్గా ఈ కోవకు చెందుతాడు ది మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో మాధవన్‌ కుమారుడు వేదాంత్‌. స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతోన్న అతను ఇప్పటికే లెక్కలేనన్ని మెడల్స్‌ సాధించాడు. ప్రతిష్ఠాత్మక వేదికల మీద సత్తాచాటుతున్నాడీ 17 ఏళ్ల గోల్డెన్‌ ఫిష్‌. తాజాగా మరోసారి ఈత పోటీల్లో అదరగొట్టాడు వేదాంత్‌. మలేషియా వేదికగా జరిగిన ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించాడు.

దేవుని దయతో..

కుమారుడు సాధించిన ఘనతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయాడు హీరో మాధవన్‌. మెడల్స్‌తో వేదాంత్‌ దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘దేవుని దయ, మీ అందరి శుభాకాంక్షలతో, వేదాంత్ రెండు వ్యక్తిగత బెస్ట్‌లతో భారతదేశానికి (50, 100, 200, 400, 1500 మీటర్లు) 5 స్వర్ణాలను సాధించాడు. ఈ విజయాలతో అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మాధవన్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు మాధవన్‌, అతని కుమారుడికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బంగారు చేపలా..

కాగా వేదాంత్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తా చాటడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా గేమ్స్‌-2023లోనూ రికార్డు పతకాలు సాధించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తోన్న వేదాంత్‌ మాధవన్ 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలతో సహా మొత్తం 7 పతకాలను గెల్చుకున్నాడు. మొత్తానికి స్విమ్మింగ్‌ కొలనులో బంగారు చేపలా పతకాల మీద పతకాలు సాధిస్తున్నాడు వేదాంత్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.