Most Recent

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Soundarya

Soundarya Death Anniversary: అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే నిండు రూపం ఆ అందాల బొమ్మ. ఎటువంటి పాత్రనైనా అవలోకగా నటించడం ఆమె ప్రత్యేకత. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య (Soundarya). ఆమె భౌతికంగా దూరమై 18 ఏళ్లు అవుతోంది. సౌందర్య వర్థంతి సందర్భంగా ఆమె సినీ జ్ఞాపకాలు.. ఓ సారి గుర్తుకు తెచ్చుకుందాం. చారడేసి కళ్ళు.. గులాబి చెక్కిళ్ళు.. చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. సౌందర్య. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. తీరైన కట్టుబొట్టుతో.. పుత్తడి కాంతుల మెరుపులతో.. చూడచక్కని నటనతో లక్షలాది మంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది సౌందర్య. ఒకదశలో సౌత్‌లో నంబర్‌ వన్‌ హీరోయిన్ గా వెలుగొంది.. తెలుగు వారి మనసుల్లో నిలిచిపోయింది. సౌందర్య 1972 జూలై 18న కర్ణాటకలోని కొలార్‌లో సత్యనారాయణ-మంజుల దంపతులకు జన్మించింది. ఈమె అసలు పేరు సౌమ్య. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. తెలుగులో సూపర్‌స్టార్‌ కృష్ణ సరసన రైతు భారతం ఆమె తొలి చిత్రం. అయితే ముందుగా విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్ళి తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలలో 100కు పైగా చిత్రాలలో నటించింది సౌందర్య.

తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన నటించింది సౌందర్య. సూపర్‌స్టార్‌ కృష్ణతో రైతుభారతం, అదిరింది గురూ, అమ్మదొంగ, నంబర్‌వన్‌, జగదేకవీరుడు, పుట్టింటి గౌరవం, మానవుడు దానవుడు.. చిత్రాలలో తన అందం, అభినయంతో అలరించింది సౌందర్య. ఆ తర్వాత సౌందర్యకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఫ్యామిలీ తరహా చిత్రాల్లో ఈమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. వెంకటేష్‌తో నటించిన పవిత్రబంధం సౌందర్య కెరీర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. తెలుగింటి ఆడపడుచులా కనిపించే నిండైన రూపానికి తోడు సౌందర్య అభినయానికి ప్రేక్షకుల దాసోహమయ్యారు. ఈ చిత్రంలోని నటనకుగాను ఉత్తమ నటిగా నంది అవార్డు ఆమెను వరించింది. ఆ తర్వాత వెంకటేష్‌తో నటించిన రాజా, జయం మనదేరా, పెళ్ళిచేసుకుందాం, దేవిపుత్రుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి చిత్రాల్లో నటించింది. వెంకటేష్‌- సౌందర్య కాంబినేషన్‌ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

రాజేంద్రప్రసాద్‌తో రాజేంద్రుడు- గజేంద్రుడు, మాయలోడు.. నాగార్జునతో హలోబ్రదర్‌, ఆజాద్‌.. వంటి చిత్రాల్లో నటించింది. అమ్మెరు చిత్రం ఆమెలోని సహజ నటిని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సినిమాలో భర్తను కాపాడుకోవడానికి ఓ గ్రామీణ యువతి పడే పాట్లు ప్రేక్షకుల కంట నీరు పెట్టించాయి. మోహన్‌బాబు సరసన నటించిన పెదరాయుడు బ్లాక్‌బస్టర్‌ మూవీగా నిలిచింది. మొదట అహంకారిగా, తర్వాత తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే పాత్రలో అద్భుతంగా నటించింది సౌందర్య. అందం ప్లస్‌ అభినయం కలగలిసిన సౌందర్యకు అదే స్థాయిలో అవార్డులు వరించాయి. మూడుసార్లు నంది అవార్డులతో పాటు పలు పురష్కారాలు అందుకుంది. కన్నడ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా సౌందర్యను వరించింది. ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు ఆమె సొంతమయ్యాయి. ఎన్నో అవార్డులతో పాటు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య 2004 ఏప్రిల్‌ 17న ఈ లోకానికి శాశ్వతంగా దూరమైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి కరీంనగర్‌ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది. పన్నెండేళ్ళ ఫిల్మ్‌కెరీర్‌లో అద్భుతమైన నటనతో తెలుగు వారి మనసు దోచుకున్న సౌందర్య.. భౌతికంగా దూరమైనా ఆమె సినిమాలు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అమె అభినయం కళ్ళముందు కదలాడుతూనే వుంది.

ఇవి కూడా చదవండి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!

Mohan Lal: మలయాళ సూపర్‌ స్టార్‌ ఉదారత.. 20 మంది గిరిజన విద్యార్థులకు 15 ఏళ్ల పాటు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.