Most Recent

KGF 2 Review: హై ఎక్స్‏పెక్టేషన్స్.. అంతకు మించిన ఎలివేషన్స్.. ఆహా అనిపించిన రాకీ భాయ్‌!

KGF Chapter 2 movie review, KGF 2 movie review, KGF2 review, KGF 2 movie rating,

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే బలమైన ప్రశ్నతో బాహుబలి2 కోసం ప్రజలు వేచి చూసినట్టు, నరాచిలో ఏం జరిగింది? అసలు కేజీయఫ్‌ సామ్రాజ్యానికి కింగులా నిలుచున్నది ఎవరు? వంటి ఆసక్తికరమైన అంశాలతో కేజీయఫ్‌ సీక్వెల్‌ కోసం వేచి చూశారు జనాలు. అందరూ వెయిట్‌ చేసిన ఆ క్షణం రానే వచ్చింది. వరల్డ్ వైడ్‌ హై ఎక్స్ పెక్టేషన్స్ తో, అత్యంత గొప్ప పబ్లిసిటీతో కేజీయఫ్‌2 రిలీజైంది. సోషల్‌ మీడియాలో ఆల్రెడీ పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న కేజీయప్‌2లో హైలైట్స్ ఏంటి?

నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్

నటీనటులు: యష్‌, సంజయ్‌ దత్‌, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్‌, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌ తదితరులు

రచన – దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌

నిర్మాత: విజయ్‌ కిరగందూర్‌

కెమెరా: భువన్‌ గౌడ

ఎడిటర్‌: ఉజ్వల్‌ కులకర్ణి

సంగీతం: రవి బస్రూర్‌

విడుదల: ఏప్రిల్‌ 14, 2022

గరుడ చనిపోయిన తర్వాత నరాచిలో ఏం జరిగింది? రాకీభాయ్‌ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? రాకీ భాయ్‌కి అధీరా వల్ల వచ్చిన ఇబ్బందులేంటి? ఆడవాళ్ల జోలికి, పిల్లల జోలికి వెళ్లకూడదనుకున్న రాకీ భాయ్‌… ప్రధాని రమికా సేన్‌ తో తలపడ్డాడా? జర్నలిస్టు కొడుకుగా విజయేంద్ర వాసిరాజు నమ్మిందేంటి? రీనా దేశాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న కమల్‌ ఏమయ్యాడు? నరాచిలో ఉన్న త్రీబై నైన్‌ స్ట్రాటజీని కనుక్కుని రాకీ ఏం చేశాడు? అదీరాతో తలపడి సంపదతో, నచ్చిన అమ్మాయితో రాకీభాయ్‌ విదేశాలకు ఎందుకు పారిపోయినట్టు? అసలు రాకీ తల్లి కోరిందేంటి? రాకీ తండ్రి ఎవరు? అతని గతం ఎలాంటిది? సిట్చువేషన్‌ ఎలాంటిదైనా, నిత్యం పనిచేయాలని అనుకునే రాకీ బాయ్‌ ఆ సంపదనంతా ఏం చేశాడు? నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? ఈ కథలో అసలు విలన్‌ ఎవరు? వంటివన్నీ ఆసక్తికరం.

2018 డిసెంబర్‌లో రిలీజైంది కేజీయఫ్‌. అడుగడుగునా ఎలివేట్‌ అయిన హీరోయిజమ్‌, తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల తాలూకు ప్రభావంతో పెరిగిన కుర్రాడు…. ఇలా సాగింది కేజీయఫ్‌. దానికి కొనసాగింపే కేజీయఫ్‌2. గరుడను చంపిన రాకీభాయ్‌గా, ఫస్ట్ పార్ట్ లో చూపించిన సేమ్‌ మేనరిజమ్‌, సేమ్‌ డైలాగ్‌ డెలివరీతో మాస్‌లో ఫైర్‌ పుట్టించే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు యష్‌. ఆయన గడ్డం, హెయిర్‌ స్టైల్‌, కోటు వేసుకున్న విధానం, తలకు గుడ్డకట్టుకునే తీరు, యాక్షన్‌ సీన్స్ లో అతను విజృంభించిన విధానం, జనాలతో పాటు కలిసిపోయి పనిచేసే సన్నివేశాల్లో చూపించిన ఈజ్‌… కేజీయఫ్‌ వరల్డ్ తో యష్‌కి మొదలైన ఫ్యాన్‌ బేస్‌, ఈ సెకండ్‌ పార్ట్ తో రెట్టింపు అవడం ఖాయం. అంత పర్ఫెక్ట్ గా పోట్రే చేశారు రాకీభాయ్‌ కేరక్టర్‌ని. హీరోయిన్‌కి కూడా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో స్పేస్‌ ఎక్కువగా ఉంది. రకరకాల ఎమోషన్స్ ని పండించే ఛాన్స్ దక్కింది. రాకీభాయ్‌ ఆశయం కోసం తన కన్న కొడుకు చావుకు ఎదురెళ్తే, ఆ బాధను గుండెల్లో పెట్టుకుని రాకీభాయ్‌ మంచిని కోరే తల్లిగా ఈశ్వరీరావు కేరక్టర్‌ బావుంది. తన తల్లిని, కుటుంబాన్ని పట్టించుకోలేదని తండ్రి మీద కినుక వహించిన కొడుకుగా, సేమ్‌ టైమ్‌ కేజీయఫ్‌ స్టోరీని నెరేట్‌ చేసే వ్యక్తిగా ప్రకాష్‌రాజ్‌ కేరక్టర్‌ స్టబర్న్ గా అనిపించింది. ప్రధానిగా రవీనా టాండన్‌ లుక్స్, కాస్ట్యూమ్స్, పెర్ఫార్మెన్స్ గురించి స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే. అదీరా కేరక్టర్‌ కోసం షూట్‌ చేసే సమయానికే సంజయ్‌దత్‌కి కేన్సర్‌ అని చెప్పారు డాక్టర్లు. అయినా ఆ దుమ్ములో, యష్‌తో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ లో సంజయ్‌దత్‌ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌. ఆ కేరక్టర్‌ కోసం వేసుకున్న మేకప్‌ దగ్గరనుంచి, ఆ కేరక్టర్‌గా ఆయన కనిపించిన విధానం వరకూ ప్రతిదీ బావుంది. సినిమాలో ఏ కేరక్టర్‌ కూడా ఊరికే ఏదో ఉండాలి కాబట్టి, ఉన్నట్టు ఉండదు. ప్రతి పాత్రకూ ఇంపార్టెన్స్ ఉండేలా స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్నారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ , ప్రశాంత్‌నీల్‌ డైరక్షన్‌ సినిమాకు ఎంత ప్లస్‌ అయ్యాయో, రవిబసూర్‌ మ్యూజిక్‌, భువన్‌ గౌడ సినిమాటోగ్రఫీ, ఉజ్వల్‌ కులకర్ణి ఎడిటింగ్‌, రామజోగయ్యశాస్త్రి పాటలు, హనుమాన్‌ చౌదరి మాటలు కూడా అంతే ప్లస్‌ అయ్యాయి. సినిమా మొత్తం స్పెషల్‌ టింటులో కనిపిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్, కాగడాల వెలుతురులో కనిపించే సన్నివేశాలు, కేజీయఫ్‌ ఏరియల్‌ షాట్స్, ఫారిన్‌ దృశ్యాలు…తల్లి కనిపించే పచ్చటి పొలాలు.. ఒకటేంటి? ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేశారు సినిమాటోగ్రాఫర్‌. ఆయన దృశ్యాల్లో ఉన్న ఇంటెన్స్ ని… తన మ్యూజిక్ తో రెట్టింపు చేశారు రవి బసూర్‌. తూఫాన్‌ సాంగ్‌ రిలీజ్‌ అయిన వెంటనే జనాలకు నచ్చేసింది. మిగిలిన పాటలు కూడా కథను ముందుకు నడిపేవే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను నెక్స్ట్ లెవల్లో కూర్చోబెట్టింది. ఎక్కడా బోర్‌ కొట్టకుండా, అంత పెద్ద స్టార్‌ క్యాస్ట్, అంత క్రూ ఉన్న సినిమాను అంతే అందంగా ఎడిట్‌ చేశారు ఉజ్వల్‌. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగితే అందులో బంగారం ఉందన్న తల్లి మాటకు క్లైమాక్స్ తో కనెక్షన్‌ పెట్టడం బావుంది.

‘తలలు మారుతాయి కానీ కిరీటాలు కాదు’ అనీ,
‘ఐ డోంట్‌ లైక్‌ వయలెన్స్, బట్ వయలెన్స్ లైక్స్ మీ…’ అనీ
‘మా వైపు ఇంటికి వచ్చిన అమ్మాయిలు దీపం పెడతారు. నువ్వు ఏకంగా దీపావళి చేశావు…’ అనీ
‘నాలాంటి వాడిని ఇంకోడిని పుట్టించడం నా అబ్బకే సాధ్యం కాలేదు. నా అబ్బ మీద ఒట్టు… ఇంకొకడు పుట్టడు’ అని హీరో చెప్పే డైలాగులు…
‘ఇది రక్తంతో రాసిన కథ. సిరాతో ముందుకు తీసుకెళ్లాం. మళ్లీ రక్తాన్నే కోరుతోంది’ అని ప్రకాష్‌రాజ్‌ చెప్పే డైలాగ్‌, అక్కడక్కడా కథానుగుణంగా చరిత్ర గురించి చెప్పే మాటలు… హీరో, హీరోయిన్ల మధ్య కల గురించి వచ్చే డైలాగులు, తను ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయాన్ని భర్తతో హీరోయిన్‌ చెప్పే సీన్‌… నాన్‌స్టాప్‌గా పేలిన గన్నును చూసి పెద్దమ్మ అని ఒకరంటే.. కాదు పెద్దయ్య అని హీరోని చూసి పిల్లాడు చెప్పడం… పోలీస్‌ స్టేషన్‌లో హీరో గురించి చిన్న పిల్లాడు ఇచ్చే ఎలివేషన్‌.. గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

సినిమాలో హీరో ఎలివేషన్‌ సన్నివేశాలు ఉండటం మామూలే. కానీ ప్రతి సీనులోనూ ఓ విషయం ఎలివేట్‌ అవుతుంటే, ప్రతి సీనూ సీట్‌ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా ఉంటే… అది కేజీయఫ్‌2 అవుతుంది. మరీ పనిగట్టుకుని లాజిక్కులు వెతికితే లోపాలు కనిపిస్తాయి కానీ, సినిమా చూసినంత సేపు కేజీయఫ్‌ వరల్డ్ లో అక్కడి వాళ్లు తప్ప ఇంకేవీ గుర్తుకురావు. దర్శకుడిగా ప్రశాంత్‌నీల్‌ సక్సెస్‌ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇంత భారీ సినిమాలో హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలకు ఫిదా అవ్వాల్సిందే.
కేజీయఫ్‌ చాప్టర్‌2 స్క్రీన్‌ ముందు… సీను సీనుకీ సీటీ కొట్టాల్సిందే….!

– డా. చల్లా భాగ్యలక్ష్మి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.