
కేరళలో పుట్టి పెరిగినా తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య లక్ష్మి. ముఖ్యంగా తమిళంలో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్య సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార. తాజాగా తమిళంలో ఈ అమ్మడు నటించిన గట్టా కుస్తీ (తెలుగులో మట్టి కుస్తీ 2) సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా అలాగే కుస్తీ క్రీడాకారిణిగా ఐశ్వర్య అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలోనే పలు సార్లు పెళ్లి చేసుకోనని చెప్పిన ఈ 35 ఏళ్ల ముద్దుగుమ్మ మరోసారి ఇదే విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
‘ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉన్నాయని బలంగా నమ్ముతా. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఇదే నమ్ముతున్నాను. కానీ గట్టా కుస్తీ 2 సినిమా షూటింగ్ సమయంలో ఒక విషయం నా మనసును ఆలోచింపజేసింది. నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర ఉంది. ఆ పాపతో నాకు కలిగిన అనుబంధం, ఒక తల్లి పాత్ర పోషిస్తున్నప్పుడు పిల్లలతో ఇంతటి బంధాన్ని పంచుకోవడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఇప్పుడు నాకు కూడా ఒక బిడ్డకు తల్లిని కావాలనిపిస్తోంది. అయితే ఒకవేళ నాకు బిడ్డ పుడితే.. ఆ చిన్నారి బాగోగులను బాధ్యతగా పంచుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తినే కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మంచి తండ్రి అనిపించుకుంటాడు. అతను మమ్మల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లిపోకుండా నేను అన్నిరకాల ప్రయత్నాలు చేస్తాను. అయితే మరో వ్యక్తిని నా లైఫ్ లోకి ఆహ్వానించే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఈ దిశగా అడుగులు వేసేలా ఇప్పుడు నాలో మార్పులు వస్తున్నాయి’ అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
మట్టి కుస్తీ 2 సినిమాలో ఐశ్వర్య లక్ష్మి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి