
వంద కోట్లతో సోషల్ సర్వీస్ చేస్తాం… గ్రామాలను తీర్చిదిద్దుతాం… ప్రజాసమస్యలను పాలకుల దగ్గరకు చేరుస్తామంటూ భారీ ఎలివేషన్లు ఇచ్చిన సంస్థ.. షట్‌డౌన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. అసలింతకి ఏం జరిగింది…? ఎన్టీఆర్ చెప్పినా ప్రజాసేవ ఆపేదేలేదన్న నిర్వాహకులు ఎందుకు వెనక్కి తగ్గారు…? కావాలనే ఆగిపోయారా…? ఎవరైనా ఆపేశారా…? అనేది సంచలనంగా మారింది.. సోషల్ మీడియా సెన్సేషన్.. రా ఎన్టీఆర్ సంస్థ బుధవారం సడెన్‌గా యూటర్న్ తీసుకుంది. తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడితో జరిగిందా…? లేక ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మెసేజ్ ఏమైనా వెళ్లిందా…? లేకపోతే మరెవరి ప్రమేయమైనా ఉందా…? అన్న చర్చ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. రా ఎన్టీఆర్ సంస్థను నిలిపివేస్తున్నామని చెప్పడంతో పాటు… ఇందులో విషయం సాధించిన వారందరికి అభినందనలని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం సరికొత్త చర్చకు తెరలేపింది. ఊరు–వాడ పేరుతో సుమారుగా 100 కోట్ల సేవా యజ్ఞం చేపడుతున్నట్టు రా ఎన్టీఆర్ సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్ ఓ సంచలనమే సృష్టించారు. ఫ్యాన్స్ వద్దన్నా… తమ హీరో ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు కంప్లైంట్ చేసినా… రా ఎన్టీఆర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినా ఏమాత్రం తగ్గకుండా ఈనెల 18న తిరుపతిలో మీటింగ్ పెట్టి తమ అజెండా ఏంటో వివరించారు సంస్థ ఆర్గనైజర్ సాయిరూప్. అభిమాని అంటే నలుగురికి ఉపయోగపడాలి అనే ఎన్టీఆర్ మాటను దృష్టిలో పెట్టుకొనే సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా సేవ చేస్తామని రా ఎన్టీఆర్ సంస్థకు భారీ ఎలివేషన్లిచ్చారు. కట్ చేస్తే… క్లోజ్ బటన్ నొక్కి ఇప్పుడందరిని షాక్‌కు గురిచేశారు.
100 కోట్ల సేవా యజ్ఞం.. ఎన్నో ప్రశ్నలు..
అయితే… ఎందుకు వెనక్కి తగ్గారో, సంస్థను ఎందుకు మూసివేస్తున్నారో అన్న విషయాలపై రా ఎన్టీఆర్ నిర్వాహకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ 100 కోట్లు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ప్రశ్నలకు సాయి రూప్ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోవడం, ఫలితంగా పెద్దఎత్తున విమర్శలు రావడమూ ఓ కారణంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆఫ్టర్ ప్రెస్‌మీట్ రా ఎన్టీఆర్ సంస్థపై విమర్శలు మరింత పెరిగాయి. దీంతోనే రా ఎన్టీఆర్ సంస్థ సేవలను నిలిపివేసిందన్న ప్రచారమూ జరుగుతోంది.
మరోవైపు ఊరు-వాడ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాలని ముగ్గురు బలమైన వ్యక్తులు పోరాడుతున్నారు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు సాయిరూప్. అయితే… ఇప్పుడు వారి మాటలు నిజమయ్యాయా.. నిజంగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి కొన్ని శక్తులు పోరాడాయా…? అందుకే విజయం సాధించిన వారికి అభినందనలు అంటూ రా ఎన్టీఆర్ ఇలాంటి పోస్ట్ పెట్టిందా…? అంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా… ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయిరూప్ మళ్లీ మాట్లాడాల్సిందే.
ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు
pic.twitter.com/8fCvNuXvkD
— RAW NTR (@RAWNTR) July 22, 2026