
హీరోయిన్ ప్రత్యూష.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించిన మరణం. ఆమె సూసైడ్ అప్పట్లో ఇండస్ట్రీని, ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. ఇప్పుడు మరోసారి ప్రత్యూష మృతి కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి, నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లోకి రాకముందే నటి ప్రత్యూష తనతోపాటు ఇంటర్ చదువుతున్న సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి రాగా.. సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30 నుంచి 8 గంటల మధ్యలో వీరిద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోగా.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్చి అయ్యాడు. వారిద్దరూ తాగిన కూల్ డ్రింక్ లో పురుగుమందు కలుపుకున్నట్లు పరీక్షలో గుర్తించారు. ఆర్గానోఫాస్పేట్ కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం.. మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడిపై సెక్షన్ 306 (ఆత్మహత్య ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు..రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి వాదనలు వినిపిస్తూ… కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని అన్నారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని.. అలా కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని అన్నారు. ఇద్దరూ కలిసి పురుగుమందు తీసుకున్నందు వల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థ్ రెడ్డి తరపు న్యాయవాది నాగముత్తు, ఎల్, నరసింహారెడ్డి వాదించారు.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..