Most Recent

Pawan Kalyan: హరిహర వీరమల్లు పార్ట్ 2 పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే..

Pawan Kalyan: హరిహర వీరమల్లు పార్ట్ 2 పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే..

హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమల్లు చిత్ర కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడిన ఓ యోధుడి కథ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మీడియా ప్రతినిధులు చిత్ర నిర్మాణంపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చారు. మాటామంతీలో కీలకమైన ప్రశ్నలు… వాటికి పవన్ కళ్యాణ్ సమాధానాలు ఇవీ….

హరిహర వీరమల్లు చిత్రం సనాతన ధర్మం అనే కాన్సెప్టును దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన చిత్రం అనుకోవచ్చా..?

– సొంత తమ్ముణ్ణి సైతం అత్యంత క్రూరంగా చంపిన ఔరంగజేబు వంటి క్రూరమైన మొగల్ చక్రవర్తి దాష్టీకాలను చూపించిన సినిమా. ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాలో చూపించాం.

ఉప ముఖ్యమంత్రిగా ఇటు సినిమాలు, అటు పాలన, మరోపక్క రాజకీయాలు చేయడం ఇబ్బందిగా అనిపించడం లేదా..?

– రాజకీయాలకే నా జీవితంలో మొదటి ప్రాధాన్యం ఇస్తాను. దాని తర్వాత సినిమాలు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే. నాకు అన్నం పెట్టింది, బతుకుదెరువు ఇచ్చింది సినిమాలే.

గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ సారి హరిహర వీరమల్లు కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లకు దిగారు. ఈ మార్పుకు గల కారణం..?

– ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చిత్ర నిర్మాణం సాగింది. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడటం నా కర్తవ్యంగా భావించాను. ప్రమోషన్లు చేయడం నా బాధ్యతగా భావించాను.

ఈ సినిమా చేస్తున్నపుడు అనేక ఇబ్బందులు పడినట్లున్నారు..?

– సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. విశాఖలో నన్ను హోటల్ లో నిర్భందించడం వంటి కీలకమైన పరిణామాలు జరిగాయి. అలాగే నా సినిమా టిక్కెట్లను రూ.10, రూ.15లకు తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు. సీమలో ఎవరికైనా పగలు ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల ఆలోచన విధానాలతో నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి నానా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇలా అన్ని విషయాలను అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటకు రావడం ఆనందంగా ఉంది.

ఈ సినిమా మొదలు పెట్టినప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు భిన్నంగా అనిపించాయా..?

– సినిమా చేయడమే పెద్ద సంఘర్షణ. దీన్ని నిత్యం అనుభవిస్తూనే ముందుకు వెళతాం. ఈ చిత్ర నిర్మాణంలోనే ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నాం.

మీ సినిమాలకు గత ప్రభుత్వంలో తక్కువ ధరకు టిక్కెట్లు అమ్మితే, ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగిన విషయాన్ని ఎలా చూస్తారు..?

– అన్ని సినిమాలకు పెరిగినట్లుగానే నా సినిమాకు పెరిగాయి. కేవలం నా సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ రేట్ల పెంపు ఇవ్వలేదు. నిర్మాతల కష్టం, వారి శ్రమ అన్ని పరిగణనలోకి తీసుకొని సినిమాలకు టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.

ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. దీన్ని మీ తోటి సహచరులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు చూపిస్తారా..?

– నాకు ఇప్పటి వరకు ఈ ఆలోచన రాలేదు. మంచి సూచన చేశారు. కచ్చితంగా నా సహచరులైన ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా షో వేసే ఏర్పాటు చేస్తాను.

జానీ సినిమా నిరాశ మిగిల్చింది. మళ్లీ ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రంలో చివరి సీన్లు మీరే తీసినట్లు చెబుతున్నారు..? అప్పటికీ ఇప్పటికీ మీ అనుభవం ఏంటీ..?

– జానీ సినిమా ఫలితం నా రాజకీయ జీవితంలో మరింత రాటుదేలేలా నన్ను మార్చిందని చెప్పొచ్చు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే నేను బయ్యర్లు, ఫైనాన్సియర్స్ అందరినీ ఇంటికి పిలిచి సెటిల్ చేశాను. చాలా రోజులపాటు నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆ రోజు జానీ చిత్ర ఫలితం నాకు రాజకీయాల్లో అపజయం వచ్చినపుడు దాన్ని తట్టుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పించింది. జీవితంలో వచ్చే అపజయాలను దాటితేనే.. నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు అనేది జానీ చిత్రంతో నాకు అవగతమైంది. తర్వాత రాజకీయ జీవితాల్లో స్ఫూర్తి పాఠం అయింది.

మీ సినిమాకు ఇతర సినిమాల మాదిరిగా థియేటర్ల కొరత సమస్య ఉంటుందా..? హరిహర వీరమల్లు చిత్రం పార్ట్ 2 అవకాశం ఉందా..?

– థియేటర్ల కొరత ఏమీ ఉండబోదు. సినిమాలకు థియేటర్లు ఇవ్వరనేది నాకు ఎప్పుడు ఎదురుకాలేదు. హరిహర వీరమల్లు పార్ట్ – 2 కూడా 20 శాతం చిత్రీకరణ పూర్తయింది.

రాజకీయాల్లో ఉంటూనే ఇకపై చిత్రాలను చేస్తారా..?

– అది భగవదేచ్ఛ. ఆయన ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడే మనం అంచనా వేయలేం కదా..?

హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పెరగాలంటే ఏం చేయాలి..?

– హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి తగిన వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ పెరిగితే బాగుంటుంది. దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి. అవకాశాలు విస్తృతం అవుతాయి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.