మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలోని చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ వెల్లడించింది. అనంతరం పలువురు నటీమణులు గతంలో తమను కొందరు దర్శకనిర్మాతలు, నటులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి. నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాకయ్యానని అన్నారు. ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళీ చిత్రపరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నాయన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాధితులకు తాను ఎప్పటికీ మద్దతు ఇస్తానని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలిని ఊర్వశి కోరారు.
ఊర్వశి మాట్లాడుతూ.. “జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గురించి విని షాకయ్యాను. నాలాంటి ఎంతోమంది మహిళలు జీవనోపాధి కోసం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వారి మధ్య పనిచేస్తున్నామని తెలిసి భయమేసింది. వ్యక్తిగతంగా నాకెప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదు. ఆరోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగినా.. అలాగే నా తల్లిదండ్రులు సైతం ప్రతిక్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తుండేవారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడే కాదు.. అన్ని ఇండస్ట్రీలలోనూ ఇది జరుగుతుంది. నటీనటులు కలిసి పనిచేసినప్పుడే మంచి సినిమాలను తెరకెక్కించగలుగుతాం. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై స్పందించి మహిళలకు రక్షణ కల్పించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని అన్నారు.
ఊర్విశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత సహాయ పాత్రలలో నటించింది. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.