సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు, నటుడు శరణ్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శరణ్ ప్రయాణిస్తోన్న బైకును ఓ కార్ ఢీకొట్టడంతో అతను సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. అతని వయసు ఇంకా 26 ఏళ్లే కావడం శోచనీయం. కాగా శరణ్ బైక్‌ను ఢీకొట్టింది మరో నటుడే కావడం గమనార్హం. చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్న పళనప్పన్ అనే వ్యక్తి కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు శరణ్ రాజ్ మృతితో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు నటుడి మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. శరణ్ రాజ్ చెన్నైలోని మధురవోయల్‌లోని ధనలక్ష్మి పేటలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అతను తన బైకుపై కేకే నగర్‌లోని రోడ్డుపై వెళుతూ ఉన్నారు. ఇదే సమయంలో శరణ్ రాజ్ వెళుతున్న బైకును ఓ కార్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు శరణ్. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శరణ్ రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.పళనప్పన్ అనే నటుడు మద్యం సేవించి కారు నడిపాడని, ఆ మత్తులోనే శరణ్ బైకును ఢీకొట్టాడని తేలింది. పోలీసులు నిందితుడ్ని అదుపులోకీ తీసుకున్నారు.
కాగా, శరణ్ రాజ్ గత కొన్నేళ్లుగా వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. నటన మీద ఆసక్తితో వెట్రిమారన్ తెరకెక్కించిన పలు సినిమాల్లో కూడా నటించారు. ధనుష్ నటించిన అసురన్, వడాచెన్నై వంటి హిట్ సినిమాల్లో నటించారు. సినిమా రంగంలో ఎంతో భవిష్యత్ ఉందనుకున్న శరణ్ హఠాత్తుగా మృత్యువాతపడడం అందరినీ కలిచివేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..