మెగా కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి. చిరంజీవి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టింది. జూన్ 20(మంగళవారం) ఉదయం రామ్ చరణ్ సతీమణి ఉపాసన పండింటి పాపకు జన్మనిచ్చింది. అమ్మాయి రాకతో మెగాస్టార్ ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి. అపోలో ఆసుపత్రి ముందు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇదే సమయంలో మెగా ప్రిన్సెస్ విషయంలో ఓ సెంటిమెంట్ కలిసొచ్చిందనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్స్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. మంగళవారం. మెగా ఫ్యామిలీకి మంగళవారంతో విడదీయరాని సంబంధం ఉంది. మెగాస్టార్ కుటుంబం ఆంజనేయ స్వామికి భక్తులు. తనకు ఇష్టమైన దైవం హనుమంతుడు అని.. ఆంజనేయ స్వామిని నమ్ముకున్న కుటుంబం మాది అని చిరు గతంలో అనేక సార్లు చెప్పుకొచ్చారు.
కేవలం చిరు మాత్రమే కాదు.. నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఆంజనేయ స్వామి భక్తులే . ఇటీవల పవన్ సైతం తన వాహనం వారాహి పూజ కోసం కొండగట్టు వెళ్లారు. ఇక ఇప్పుడు మెగా కుటుంబంలోకి ప్రిన్సెస్ కూడా మంగళవారమే అడుగుపెట్టింది. మెగా కుటుంబంలో మూడో తరంలో తొలి అడుగువేసి మొదటి వారసురాలు.. మంగళవారం జన్మించింది. దీంతో చిరుకు మంగళవారం సెంటిమెంట్ మరోసారి కలిసోచ్చింది. అంతేకాకుండా.. ఈ ఏడాది చెర్రీకి మరింత స్పెషల్. ఈ సంవత్సరంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం.. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత మెగా కుటుంబంలోకి వారసురాలు రావడం.
ఇక తాము ఆంజనేయ స్వామిని నమ్ముకున్న కుటుంబం అని.. మంగళవారం రోజున పాపను ప్రసాదించటం ఎంతో అపురూపం అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘‘మంగళవారం ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్‌చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పాప ఎంతో అపురూపం. చాలా సంవత్సరాల నుంచి వాళ్లు తల్లిదండ్రులై తమ పిల్లలను మా చేతిలో పెట్టాలని కోరుకున్నాం. ఇన్నేళ్లకు ఆ భగవంతుడి దయ వలన మా కోరిక నేరవేరింది. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి మా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ నా కుటుంబం తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. పెద్దలు పాప పుట్టిన ఘడియలు చాలా మంచివని అంటున్నారు. ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తుంది. నా కుటుంబం ఆంజనేయ స్వామినే నమ్ముకున్నాం. ఆయనకు చెందిన మంగళవారం రోజున అమ్మాయిని ప్రసాదించటం అనేది అపురూపంగా భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.