
సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే నవీన్ గారికి, మా సినీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నా అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. 28 ఏళ్ళ నుంచి మీరు నాపై ఈ ప్రేమను చూపిస్తున్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాగవంశీ గారు, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. త్రివిక్రమ్ గారిని వెంకీ స్ఫూర్తిగా తీసుకున్నారు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. వెంకీ, జీవీ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ అవుతుంది. డీఓపీ నిమిష్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్ లో ఉన్న ఆరు నెలలను అసలు మరచిపోలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక గారి వల్ల ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. మమిత ఎనర్జిటిక్ గా నటించింది. వెంకీ సిన్సియర్ డైరెక్టర్. 200 శాతం కష్టపడతారు. దర్శకుడు కంటే రచయితగా ఇంకా ఎక్కువ అభిమానిస్తాను. ఇంత గొప్పగా రాయడం మామూలు విషయం కాదు. వెంకీతో మళ్ళీ కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. శివకుమార్ కుమారులైన మమ్మల్ని తెలుగు దత్త పుత్రులు అన్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఎంతో ప్రేమ ఇచ్చారు. ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అంతే ప్రేమ ఇస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “ముందుగా తక్కువ సమయంలో ఈ వేడుక జరగడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. సినీ పరిశ్రమకు అండగా ఉంటుందన్నందుకు, గద్దర్ అవార్డులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు.. సినీ పరిశ్రమ తరపున తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. డబ్బులు పెట్టి థియేటర్ కి వెళ్ళి సినిమా చూసి, నచ్చితే పదిమందికి చెప్పే ప్రేక్షకుల దగ్గర నుంచి.. సినిమాలో ఉన్న తప్పొప్పులు చెప్పే రివ్యూయర్ల వరకు నాకు అందరూ ముఖ్యమే. ఏదైనా తప్పు చేస్తే, దానిని సరి చేసుకొని మరింత బాధ్యతగా పని చేస్తాను. ఈ సినిమా నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. థియేటర్లో చూసే ప్రేక్షకులకు కూడా ఆ సంతృప్తిని కలిగిస్తుంది. ఇది సూర్య గారి అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు, సూర్య అభిమానుల కుటుంబాల కోసం కూడా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపూ మీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఈ మాట నేను దర్శకుడిగా చెప్పట్లేదు, ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. ఎడిటర్ నవీన్ నూలి సినిమా చూసి హిట్ కొట్టేశావు అన్నారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రాధిక గారు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి అమ్మ కావాలి, ఇలాంటి ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది. సూర్య గారు, మమిత జోడిని తెరమీద చూస్తే ప్రేమలో పడిపోతారు. నేను సూర్య గారి వీరాభిమానిని. గత 20 ఏళ్లుగా ఆయన ప్రతి సినిమా చూస్తున్నాను. ఇప్పుడు నేను ఆయన్ని డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సూర్య గారు గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. సేవా కార్యక్రమాలతో ఆయన ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.