
గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం (మార్చి 15) నిర్వహించిన ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ వేడుకకు హాజరైన అభిమానులకు, లైవ్ లో వేడుకను వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైనవి. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకు ఆనందం కలగాలని కోరుకుంటాను. సినిమా ఎంత వసూలు చేసింది అని నేను ఎప్పుడూ పట్టించుకోను. సినిమా బాగుండాలని కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా అని చూడను.. భారతీయ సినిమా అనుకుంటాను నేను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంటుంది. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి నా కృతఙ్ఞతలు’
‘ సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్ చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా.. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేశాము. 40-45 రోజుల్లోనే సినిమా పూర్తి చేశాము. రోజుకి ఐదారు గంటల లోపే పని చేశాను. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసాను ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే.. దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది. ఈ చిత్రానికి లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కరభట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి కృతఙ్ఞతలు. పీఆర్ఓ లక్ష్మి వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ కి, స్టంట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ గార్లకు, రచయితలు రమేష్ రెడ్డి గారికి, దశరథ్ గారికి, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి, సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గారికి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి, నేపథ్య సంగీతం బాధ్యతలు తీసుకున్న తమన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పర్ఫార్మర్. శ్రీలీల గారి కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. రాశి ఖన్నా గారు నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్య పాత్రలు చేసిన పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారికి కృతఙ్ఞతలు. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటినుంచో చెప్పేవారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుందని ఆశిస్తున్నాము.
‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. మీలో(అభిమానుల్లో) ఒకడు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుత దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో ఈ సినిమా చేశాడు. నా గుండెల్లో నుంచి ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను.. హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున ఈ సినిమాను మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి అని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తుంది. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు. అభిమానులకు, నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం కూడా ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతఙ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు.” అన్నారు.
ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ స్పీచ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.