
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే కొన్ని రూల్స్ తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయని ఆమె చెబుతోంది. అందరూ తనను పొగుడుతున్నా.. తనలో మాత్రం ‘నేను వీళ్లందరి కంటే తక్కువ’ అనే భావన ఉండేదట. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. మనందరి ఫేవరెట్ మృణాల్ ఠాకూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ స్ట్రగుల్స్ గురించి పలు విషయాలు పంచుకుంది మృణాల్.
సినిమా రంగంలో హీరోయిన్ అంటే ఒక నిర్దిష్టమైన ఆకృతిలో ఉండాలి, ఇలాగే కనిపించాలి అనే అలిఖిత నిబంధనలు ఉంటాయని మృణాల్ అభిప్రాయపడింది. “నేను హీరోయిన్ మెటీరియల్ కానేమో, లీడింగ్ లేడీగా ఉండటానికి నాకు తగిన అర్హతలు లేవేమో అని ఒకప్పుడు చాలా బాధపడ్డాను. మన చుట్టూ ఉన్న ప్రపంచం అందానికి ఒకే రకమైన డెఫినిషన్ ఇస్తుంది. ఆ చట్రంలో మనం ఇమడలేకపోతే మన మీద మనకే అపనమ్మకం కలుగుతుంది” అని మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది. తనను తాను ఇతరులతో పోల్చుకోవడం వల్ల తనలోని ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్న రోజులను ఆమె గుర్తు చేసుకుంది.
తెర వెనుక అసలు కథ..
చాలామంది నటులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా.. బయటకు మాత్రం ఎంతో కాన్ఫిడెంట్‌గా నటిస్తారని మృణాల్ చెప్పింది. “స్క్రీన్ మీద లేదా పబ్లిక్ ఈవెంట్లలో మేము ఎంతో ధైర్యంగా కనిపిస్తాం. కానీ ప్రైవేట్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఇన్ సెక్యూరిటీస్ తో పోరాడుతుంటాం. చాలామంది నటులు తమ లోపల ఉన్న భయాలను బయటపెట్టరు” అని ఆమె పేర్కొంది.
ఒక వ్యక్తి ఎంత సక్సెస్ లో ఉన్నా సరే, తన రూపం గురించి ఇతరులు ఏమనుకుంటారో అనే భయం వారిని వెంటాడుతూనే ఉంటుందని మృణాల్ స్పష్టం చేసింది. ఈ కాలంలో సోషల్ మీడియా వల్ల అందం మీద ఒత్తిడి మరింత పెరిగిందని మృణాల్ అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరూ ఒకరి రూపాన్ని విశ్లేషించడం, కామెంట్లు చేయడం వల్ల ‘పర్ఫెక్ట్’ గా కనిపించాలనే తపన భారంగా మారుతోందని ఆమె చెప్పింది.
ఆన్‌లైన్‌లో వచ్చే పోలికలు, విమర్శలు మనిషిలో ఉన్న సెల్ఫ్ డౌట్‌ను ఇంకా పెంచుతాయని మృణాల్ హెచ్చరించింది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో చూసే అవాస్తవ అందాల ప్రమాణాలను చూసి మోసపోకూడదని, వాటిని అందుకోవాలని ఒత్తిడికి గురికావద్దని మృణాల్ సూచించింది. మృణాల్ ఠాకూర్ మాటలు వింటుంటే.. సక్సెస్ లో ఉన్న వ్యక్తులు కూడా తమ జీవితంలో ఎన్నో మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారని అర్థమవుతుంది. అందం అనేది బాహ్య రూపంలో లేదు, అది మన మనసులో ఉండే ఆత్మవిశ్వాసంలో ఉందని మృణాల్ నిరూపించింది. తన బలహీనతలను ధైర్యంగా ఒప్పుకోవడం వల్లే మృణాల్ ఈరోజు ఇంతటి ఉన్నత స్థానంలో నిలబడింది.