బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో అదుపులోకి జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకున్నారు. ప్రశాంత్‌తోపాటు అతడి సొదరుడు రాజును సైతం పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో విచారించారు. ఈనెల 17న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకుని నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి ఈ దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చగా. ఇప్పటికే A4, A5లను అరెస్ట్ చేశారు. ఇక నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్‌ను, అతడి తమ్ముడి రాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ మీద మొత్తం 9 కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది..పల్లవి ప్రశాంత్‌తోపాటు సోదరుడు రాజుకి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. అర్ధరాత్రి ప్రశాంత్, అతడి తమ్ముడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రైతుబిడ్డగా.. కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్లో అమర్ దీప్, ప్రశాంత్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అటు రైతు బిడ్డ కావడం.. హౌస్‌లో అతడి ఆట తీరు చూసి ప్రశాంత్ కు చాలా మంది సపోర్ట్ చేశాడు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ లో విజేతగా నిలిచాడు ప్రశాంత్. అయితే డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ఫినాలే కంటెస్టెంట్స్ అభిమానులు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఫినాలే అనంతరం బయటకు వచ్చిన రన్నరప్ అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కారు అద్దం పగలగొట్టారు. మరికొంత మంది సెలబ్రెటీస్ కార్లపై దాడులు చేశారు. ఇక స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అభిమానం పేరుతో నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం..ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ ఆర్టీసి ఎండీ వీసి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.