
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ‘బేబీ’ మూవీ. హృదయ కాలేయం ఫేమ్ సాయి రాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని నమోదు చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ బజ్‌తో దూసుకుపోయింది. ఏకంగా అర్జున్ రెడ్డి సినిమాను బ్రేక్ చేసి మరీ రికార్డులను తిరగ రాసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదలై 20 రోజులు గడుస్తోన్నా ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతుండడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. అల్లు అర్జున్ మొదలు, చిరంజీవి వరకు బేబీ మూవీపై పొగడ్తలు కురిపించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న వైష్ణవి చైతన్యకు ప్రశంసలు కురిశాయి. తనదైన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీలో ప్రేక్షకులకు బేబీ మూవీ యూనిట్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బేబీ థియేటర్‌లో సినిమా నిడివి సుమారు 3 గంటల ఉంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ నిడివిని పెంచే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా గంట పాటు సినిమా నిడివి పెంచనున్నట్లు సమాచారం. ఇక సాంగ్‌తో పాటు మరికొన్ని సన్నివేశాలను కూడా సినిమాలో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య, విరాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువగా కలపనున్నారని సమాచారం. అలాగే ఆనంద్, తన తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బేబీ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉండగా ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కడుతుండడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బేబీ తర్వాత వచ్చిన మరే సినిమా బేబీ మూవీ కలెక్షన్లను అడ్డుకోలేక పోయాయి. ఓవైపు బడా సినిమాల కలెక్షన్లు దూసుకుపోయినా, బేబీ మూవీ వసూళ్లు కూడా స్థిరంగా కొనసాగాయి. మొత్తానికి చిన్న సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న బేబీ, ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..