తమిళ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈహీరోకు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్. ఆయన నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు అయిన ఉదయ్ నిధి.. పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు ఉదయ్ నిధి. తమిళనాడులో జరగిన గత ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఇటీవలే యూత్ వెల్ఫేర్ క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినారు ఉదయ్ నిధి.
మంత్రి అయిన తర్వాత ఆయన మళ్లీ సినిమాలు ఒప్పుకోలేదు. ఇక ఇప్పటికే ఆయన నటించిన మామన్నన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ఉదయ్ నిధి జోడిగా కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సినిమాలు చేయనని తెలిపారు.
మామన్నన్ లాంటి మంచి సినిమా తన చివరి సినిమా కావడం సంతోషంగా ఉందన్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో తాను ఓ సినిమా చేయాల్సి ఉందని.. కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమాల్లో నటించడం సరికాదని అన్నారు. అందుకే సినిమాలు ఆపేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ మామన్నన్ దర్శకుడు మారి సెల్వరాజ్ కనుక మంచి కథతో మళ్లీ వస్తే మూడేళ్ల తర్వాత నటించడానికి ఆలోచిస్తానన అన్నారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించారు.